Begin typing your search above and press return to search.

గాంధీ ఆస్ప‌త్రి ను త‌ల‌పిస్తున్న గాంధీభ‌వ‌న్‌

By:  Tupaki Desk   |   13 Nov 2018 3:44 PM GMT
గాంధీ ఆస్ప‌త్రి ను త‌ల‌పిస్తున్న గాంధీభ‌వ‌న్‌
X
మ‌హాకూట‌మి పొత్తు - సీట్ల కేటాయింపులో భాగంగా ముందుగా ఊహించిన‌ట్లే - కాంగ్రెస్ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. సీట్ల పోరులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు చేస్తున్న ఆందోళ‌నపై తాజా మంత్రి కేటీఆర్ భారీ సెటైర్ వేశారు. గాంధీభవన్‌ ను చూస్తుంటే గాంధీ ఆస్పత్రిని తలపిస్తోంది అని ఆయ‌న ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌ లో కాంగ్రెస్ నేతలు సెలైన్ బాటిళ్లు పెట్టుకొని దీక్షలు చేస్తున్నారని - సీట్ల కోసమే కొట్లాడుకుంటున్న వారికి పదవిస్తే ఏం చేస్తారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. జలవిహార్‌ లో ఏర్పాటు చేసిన దివ్యాంగుల కృతజ్ఞత సభలో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని తెలిపారు. టీఆర్‌ ఎస్ సర్కార్ ఏర్పడగానే దివ్యాంగుల పెన్షన్‌ ను రూ. 1500కు పెంచింద‌న్నారు. డిసెంబర్ 11న మళ్లీ టీఆర్‌ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పెన్షన్‌ ను రూ. 3016కు పెంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 4.90 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, నెలకు రూ. 1500 చొప్పున రూ. 880 కోట్లను దివ్యాంగులకు ఇస్తున్నామ‌ని వివ‌రించారు.

కాంగ్రెస్ సీట్లు ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదని - మొద‌టి జాబితాకే ఈ స్థాయిలో సిగ‌ప‌ట్లు ఉంటే.... మొత్తం సీట్లు ప్ర‌క‌టించే వ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. పగటిపూట సీట్లు ప్రకటిస్తే గొడవలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ జాబితాను అర్ధరాత్రి ప్రకటించారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆస్తులు పెంచుకున్నారే తప్ప ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేద‌ని కానీ తాము ప్రజ‌ల కోసం ఆ నిర్ణ‌యాన్ని తీసుకున్నామ‌న్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనను ప్రధాని మోడీ పొగిడారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ పరిణతితో వ్యవహరిస్తున్నారంటూ మోడీ పార్లమెంట్‌ లో చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.టీఆర్‌ ఎస్ - బీజేపీ రాజకీయ ప్రత్యర్థులుగానే ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఆంధ్రా సీఎం చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఎందుకు ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయ‌న రాష్ట్రం కోసమే ప్ర‌య‌త్నాల‌న్నీ అని వ్యాఖ్యానించారు.

దివ్యాంగుల కోసం త‌మ ప్ర‌భుత్వం పాటుప‌డుతుంద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. దివ్యాంగులను పెళ్లి చేసుకున్న వారికి రూ. లక్ష చొప్పున ప్రోత్సాహకం ఇస్తున్నామ‌న్నారు. `రూ. 10 కోట్ల వరకు దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్‌ ను దివ్యాంగులకు కల్పించాం. డబుల్ బెడ్‌ రూం ఇండ్లలో 5 శాతం దివ్యాంగులకు ఇస్తాం. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐటీ పార్కులు - ప్రతి జిల్లాలో దివ్యాంగ్ భవనాలు నిర్మిస్తాం` అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పిన కేటీఆర్.. దీని కోసం రూ. 5,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. బడ్జెట్‌ లో 43 శాతం నిధులను పేదల సంక్షేమానికే ఖర్చు చేస్తున్నామని తెలిపారు.