Begin typing your search above and press return to search.

కేటీఆర్ కుమ్మేస్తున్నారు

By:  Tupaki Desk   |   11 Feb 2016 7:31 AM GMT
కేటీఆర్ కుమ్మేస్తున్నారు
X
గ్రేటర్ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించి తిరుగులేని విజయం సాధించిన కేటీఆర్ అందుకు బహుమతిగా తండ్రి చేతిలోని పురపాలక శాఖను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ శాఖకు, గ్రేటర్ ప్రజలకు ఇచ్చిన హామీలకు న్యాయం చేసేందుకు ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా కదనరంగంలోకి దూకారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల మౌలిక సదుపాయాల కల్పన - మెరుగైన సౌకర్యాలకు వెంటనే 100 రోజుల ప్రణాళికను రూపొందించాల్సిందిగా రాష్ట్ర పురపాలక - పట్టణా భివృద్ధి - ఐటి - పంచాయితీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మున్సిపల్ మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన కెటిఆర్ వెంటనే మున్సిపల్ - జిహెచ్ ఎంసి పరిధిలోని ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ప్రజల అవసరాలను తీర్చటానికి జిహెచ్ ఎంసి పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై 100 రోజుల ప్రణా ళికలను రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ స్వల్పకాలిక ప్రణా ళికతో పాటు వచ్చే మూడేళ్లలో చేయగలిగే పనులపై మధ్యంతర ప్రణిళిక, రానున్న ఐదేళ్లలో పూర్తిచేసే దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి నగరవాసులు తమపై కోటి ఆశలతో పెట్టుకున్నారని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. నగరవాసుల మనోభావాలు ప్రతిబింబించేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. పౌరసేవలు మరింత సమర్ధవంతంగా అందించటానికి అవసరమైతే ప్రస్తుత చట్టాల్లో మార్పులు చేపట్టటానికి కూడా తాము సిద్ధమేనని కేటీఆర్ చెబుతున్నారు.

హైదరాబాద్ నగరం విషయంలో కేటీఆర్ పక్కా ప్రణాళికతో ఉన్నారనడానికి ఆయన ఈ సమావేశంలో చేసిన సూచనలే నిదర్శనం. నగరాన్ని క్లీన్ - గ్రీన్ - సేఫ్ స్మార్ట్‌ సిటీ - లివబుల్ నగరంగా చేయాలన్నది తన టార్గెట్ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలోనూ ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు రూపొందించి ఆ గ్రూప్‌ లో అధికారులను కూడా ఉంచాలన్నారు. ఆయా డివిజన్లలోని సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని చెప్పారు. ప్రభుత్వ విభాగాలను అధికారులు మాత్రమే నడిపిస్తునారన్న భావనలో ప్రజలున్నారని అందుకనే ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచాలని సూచించారు. నగరంలో రోడ్లపై ఏర్పడే గుంతలు - దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు ప్రత్యేక వెబ్‌ సైట్‌ ను ఏర్పాటు చేయాలన్నారు. భవన నిర్మాణ అనుమతులను పూర్తిగా ఆన్‌ లైన్‌ లోనే అందించాలని చెబుతూ ముందుగా మూడు సర్కిళ్ళలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని తెలిపారు. మొత్తానికి అప్పుడే కేటీఆర్ మార్కేంటో చూపించారని ఆయన సహచరులు అంటున్నారు.