Begin typing your search above and press return to search.

మంత్రి ప‌ద‌వి మాట ఎవ‌రి ద్వారా తెలిసిందో తెలుసా?

By:  Tupaki Desk   |   22 Feb 2019 5:26 AM GMT
మంత్రి ప‌ద‌వి మాట ఎవ‌రి ద్వారా తెలిసిందో తెలుసా?
X
వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. 69 రోజుల స‌స్పెన్స్ తీరి.. ప‌ది మందికి కేసీఆర్ కేబినెట్‌ లో చోటు ల‌భించ‌టం ఇప్పుడు పాత విష‌య‌మైంది. అయితే.. ఈ ఎపిసోడ్‌ కు సంబంధించి బ‌య‌ట‌కు రాని మ‌రో ఆస‌క్తిక‌ర అంశం ఉంది. అదేమంటే.. ఎవ‌రికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది? ఎవ‌రికి రాద‌న్న స‌స్పెన్స్ నెల‌కొన్న నేప‌థ్యంలో.. మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్న వారికి అంద‌రి కంటే ముందుగా తెలియ‌జేసిన వైనం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మంత్రి ప‌ద‌వులు ఎవ‌రికి ఇవ్వాల‌న్న విష‌యంపై కేసీఆర్ ఎప్పుడో డిసైడ్ అయిన‌ట్లు చెబుతున్నారు. దీనిపై ఆయ‌న మొద‌ట్లోనే ఫైన‌ల్ చేసుకున్నార‌ని.. దీని కోసం ప్ర‌త్యేకంగా క‌స‌ర‌త్తు చేసింది లేద‌ని తెలుస్తోంది. అయితే.. మ‌ల్లారెడ్డి విష‌యం మాత్రం ఇందుకు మిన‌హాయింపుగా చెబుతున్నారు. చివ‌ర్లో మ‌ల్లారెడ్డి పేరును యాడ్ చేసిన‌ట్లుగా స‌మాచారం. ఇదిలా ఉంటే.. మంత్రి ప‌ద‌వులు ఎవ‌రికి కేటాయించార‌న్న విష‌యాన్ని ఎవ‌రికి వారికి వ్య‌క్తిగ‌తంగా స‌మాచారాన్ని చేర‌వేసిన‌ట్లుగా తెలుస్తోంది.

పేర్ల‌ను ప్ర‌క‌టించ‌టానికి రెండు రోజుల ముందే.. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వ‌యంగా మంత్రుల్ని పిలిపించుకున్నార‌ని.. వారిని పిలిచి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నుంద‌న్న స్వీట్ న్యూస్ చెప్పి వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మంత్రి ప‌ద‌వి ఖ‌రారైంది..బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌కండి.. అధికారికంగా మేమే చెబుతాం. అప్ప‌టివ‌ర‌కూ పొక్క‌నీయ‌కండ‌న్న మాట కేటీఆర్ నోట వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

కేటీఆర్ నోట మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న విష‌యం తెలిసినంత‌నే ప‌లువురు నేత‌లు ఆనందంతో ఉబ్బిత‌బ్బుబ్బిపోవ‌ట‌మే కాదు.. త‌మ‌కు చేసిన మేలును జీవితంలో మ‌ర్చిపోలేమ‌న్న మాట‌ను ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఎమోష‌న‌ల్ సీన్లు చోటు చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ కార‌ణంతోనే మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం రోజున.. రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చిన కేటీఆర్ ప‌ట్ల మంత్రులు విన‌య విధేత‌ల్ని ప్ర‌ద‌ర్శించ‌టంతో పాటు.. ఆయ‌న‌కు వంగి వంగి న‌మ‌స్కారాలు పెడుతూ.. త‌మకున్న అభిమానాన్ని ఎవ‌రికి వారుగా.. వారి స్టైల్లో ప్ర‌ద‌ర్శించిన‌ట్లుగా చెబుతున్నారు.