Begin typing your search above and press return to search.

చిన్నారి లేఖకు స్పందించిన కేటీఆర్

By:  Tupaki Desk   |   19 Feb 2018 4:08 AM GMT
చిన్నారి లేఖకు స్పందించిన కేటీఆర్
X
సోషల్ మీడియా వేదికగా తన దృష్టికొచ్చే సమస్యలపై స్పందించే కేటీఆర్ మరోసారి స్పందించారు. ఈసారి ఓ ఆరేళ్ల చిన్నారి తననుద్దేశించి రాసిన లేఖపై ఆయన స్పందించి ఆమె కోరిక తీరుస్తానని చెప్పారు. చౌరస్తాల్లోని సిగ్నల్ పాయింట్ల వద్ద యాచించే పిల్లలను చూసిన ఆ ఒకటో తరగతి పాప, ఎంతో ఆవేదనతో కేటీఆర్‌కు లేఖ రాయగా దాన్ని ఆమె తండ్రి ట్విటర్లో పోస్ట్ చేశారు.

"డియర్ కేటీఆర్ అంకుల్.. నేను సుప్రియని. నా వయసు ఆరు సంవత్సరాలు ఆల్వాల్ హిల్స్ లోని సెయింట్ పీయస్ టెన్త్ స్కూల్ లో ఒకటో తరగతి చదువుకుంటున్నాను. సుచిత్రా జంక్షన్ వద్ద పిల్లలు అడుక్కుంటున్నారు. వారికి ఉండేందుకు ప్రదేశం - ఆహారం - విద్యను అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకోసం నా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 2000 రూపాయలను మిమ్మల్ని కలిసి ఇస్తాను" అంటూ ఆ పాప లేఖ రాసింది.

ఆ పాప తండ్రి నాగేశ్వరరావు కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ - లెటర్ ను ట్విట్టర్ లో పోస్టు చేయగా - దాన్ని చూసిన కేటీఆర్ స్పందించారు. "మీ పాపకు నా తరఫున థ్యాంక్స్ చెప్పాలని - ఆ పాప చెప్పిన చిన్న పిల్లల పట్ల తప్పకుండా శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. " ఇక ఆ పాప తన కిడ్డీ బ్యాంకు సేవింగ్స్ ను ఇస్తానని చెప్పడం తనకెంతో నచ్చిందని అన్నారు. ఆమె మనసును బాధపెట్టిన అంశంపై దృష్టిపెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.