Begin typing your search above and press return to search.

లేటుగా రియాక్ట్ అయినా లెక్క స‌రి చేసిన కేటీఆర్!

By:  Tupaki Desk   |   20 May 2019 6:13 AM GMT
లేటుగా రియాక్ట్ అయినా లెక్క స‌రి చేసిన కేటీఆర్!
X
కాలం క‌లిసి వ‌స్తుంటే ఇలాంటివే చోటు చేసుకుంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కానీ.. టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల‌ను చూస్తే.. ఒక విష‌యం కామ‌న్ గా క‌నిపిస్తుంది. రాష్ట్రంలో ఏదైనా పెద్ద ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ప్ర‌భుత్వ‌ప‌రంగా స్పందించిన తీరు పెద్ద‌గా క‌నిపించ‌దు.
సంచ‌ల‌నం సృష్టించిన హాజీపూర్ సైకో వ్య‌వ‌హారంలో బాధితులను క‌ఠినంగా శిక్షిస్తామ‌న్న మాట‌తో పాటు.. వారిని పరామ‌ర్శించింది ఎక్క‌డా క‌నిపించ‌దు. ఈ విష‌యంపై ప్ర‌జాసంఘాలు.. వివిధ పార్టీలు రంగంలోకి దిగి బాధితుల త‌ర‌ఫున గ‌ళాన్ని వినిపిస్తున్నారు. బాధితులు చేస్తున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌ల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఇంత జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న ఎందుకు లేద‌న్న మాట‌కు స‌మాధానం వినిపించ‌ని ప‌రిస్థితి. తెలంగాణ అధికార‌ప‌క్షం నుంచి ఎలాంటి ప‌రామ‌ర్శ లేక‌పోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్న వేళ‌.. ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న మైన‌స్ ను ప్ల‌స్ గా మార్చుకోవ‌టంలో స‌క్సెస్ అయ్యారు కేటీఆర్.

త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని ఇట్టే వాడేసిన ఆయ‌న‌.. లేటుగా అయినా లేటెస్ట్ అన్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంద‌ని చెప్పాలి. తాము చేస్తున్న ఆందోళ‌న‌ల్ని పోలీసులు అడ్డుకోవ‌టంపై..హాజీపూర్ బాధితులు చేప‌ట్టిన నిర‌స‌న‌కు సంబంధించిన ఫోటోను కేటీఆర్ ట్విట్ట‌ర్ ఖాతాకు జ‌త చేశారు మాల్యాల గ్రామ స‌ర్పంచ్ శ్రీ‌నివాస్. శ‌నివారం రాత్రి ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు.

స‌ద‌రు ట్వీట్ కు స్పందించిన కేటీఆర్.. ఆదివారం రాత్రి 8.30 గంట‌ల వేళ‌లో స‌ర్పంచ్ శ్రీ‌నివాస్ కు ఫోన్ చేశారు. హాజీపూర్ దారుణ ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేసిన ఆయ‌న న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. హాజీపూర్ లో ఘ‌ట‌న‌లు చాలా దారుణ‌మ‌ని.. సీఎంగారు బాధ ప‌డుతున్న‌ట్లు చెప్పారు. ఈ విష‌యంలో ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలో అంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న ఆయ‌న‌.. తాను ఫోన్ చేసిన విష‌యాన్ని బాధితుల‌కు తెలియ‌జేయాల‌న్నారు.

అపాయింట్ మెంట్ ఇస్తే.. బాధితుల‌తో క‌లిసి వ‌స్తామ‌న్న స‌ర్పంచ్ మాట‌కు బ‌దులిచ్చిన కేటీఆర్.. 23 పోలింగ్ హ‌డావుడి పూర్తి అయ్యాక‌.. తానే గ్రామానికి వ‌స్తాన‌ని చెప్పారు. హాజీపూర్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చి వారాలు దాటుతున్నా.. స్పందించ‌లేద‌న్న ప్ర‌భుత్వంపై ఉన్న విమ‌ర్శ‌ల్ని త‌న తాజా ఫోన్ కాల్ తో కేటీఆర్ లెక్క స‌రిచేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.