Begin typing your search above and press return to search.

తెలంగాణకు కొత్త గవర్నర్? స్పందించిన కేటీఆర్!

By:  Tupaki Desk   |   19 July 2019 12:30 PM GMT
తెలంగాణకు కొత్త గవర్నర్? స్పందించిన కేటీఆర్!
X
ఒకవైపు రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండే పద్ధతి మారిపోతోంది. ఏపీకి కొత్త గవర్నర్ కు అక్కడ రాజ్ భవన్ కూడా రెడీ అవుతోంది. తమ పార్టీ సీనియర్ ను ఏపీకి గవర్నర్ గా పంపుతున్నారు కమలనాథులు.

ఇదే సమయంలో తెలంగాణకు గవర్నర్ గా పరిమితం అయిన నరసింహన్ ఆ పదవిలో కొనసాగుతారా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. నరసింహన్ ఏపికి గవర్నర్ గా వచ్చి దాదాపు పదేళ్లు కావొస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు స్థాన చలనం తప్పదనే అంచనాలున్నాయి.

కేంద్రంలో ప్రభుత్వాలు మారిపోయినా, రాష్ట్రమే ముక్కలు అయినా నరసింహన్ మాత్రం మారలేదు. అలా ఆయన లౌక్యంగా నడిపించుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు అయినా ఆయనకు స్థాన చలనం ఉంటుందా? అనేది సందేహమే!

ఆ సంగతలా ఉంటే ఈ విషయంపై స్పందించారు కేటీఆర్. తెలంగాణ గవర్నర్ మార్పు విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని కేటీఆర్ తేల్చారు. అది తమకు సంబంధం లేని మేటర్ అన్నట్టుగా స్పందించారు కేటీఆర్.

ఇక ఏపీ రాజకీయం గురించి ఫాలో కావడం లేదని, అక్కడి అసెంబ్లీలో ఏం జరుగుతోందో పట్టించుకోవడం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కర్ణాటక రాజకీయం పై కూడా ఆసక్తి లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఏఐసీసీకే అధ్యక్షుడు లేని పరిస్థితి ఉందని కేటీఆర్ ఆ పార్టీ పై కామెంట్ చేశారు!