Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్ ఎన్నిక‌పై కేటీఆర్ జోస్యం అదిరింది

By:  Tupaki Desk   |   24 Nov 2015 8:19 AM GMT
గ్రేట‌ర్ ఎన్నిక‌పై కేటీఆర్ జోస్యం అదిరింది
X
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌లో రికార్డు స్థాయి మెజార్టీతో స‌త్తా చాటిన తెలంగాణ అధికార టీఆర్ ఎస్ పార్టీ త‌ర్వాతి టార్గెట్ ఏంటి? ఈ ఫ‌లితాన్ని ఆ పార్టీ ఎలా చూస్తోంది? భ‌విష్య‌త్ ఎన్నిక‌ల విష‌యంలో గులాబీ పార్టీ అంచ‌నా ఎలా ఉంది? ప‌్ర‌తిప‌క్షాల ప్ర‌భావం ఏ మేర‌కు ఉండ‌నుంది? ఈ ప్రశ్న‌ల‌కు టీఆర్‌ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల నుంచి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం వ‌స్తోంది. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నిక‌ల గురించి త‌న‌దైన శైలిలో విశ్లేషించారు.

త్వ‌ర‌లో వెలువ‌డ‌నున్న నారాయ‌ణ్ ఖేడ్ ఉప ఎన్నిక‌లోనూ త‌మ పార్టీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. దీంతోపాటే వ‌చ్చే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లోనూ గులాబీ జెండా ఎగ‌ర‌నుంద‌ని చెప్పారు. గ్రేట‌ర్ లో గులాబీ జెండా తిరుగులేని రీతిలో ఎగురుతుంద‌ని వివ‌రిస్తూనే....ఆయా పార్టీల స‌త్తాను కూడా ఖ‌రారు చేశారు. ఓట్లప‌రంగా చూస్తే టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌థ‌మ స్థానంలో ఉంటుందని, రెండో స్థానంలో ఎంఐఎం - మూడో స్థానంలో బీజేపీ - నాలుగో స్థానంలో టీడీపీ ఉంటుంద‌ని ఆఖ‌రి స్థానానికి కాంగ్రెస్ ప‌డిపోతుంద‌ని కేటీఆర్ చెప్పారు.

ఇంతేకాకుండా ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నింటికంటే టీఆర్ ఎస్ ఓటు శాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ ఎంఐంఎతో తాము జ‌ట్టుక‌డితే ప్ర‌తిప‌క్షాలు క‌నుచూపుమేర‌లో కూడా ఉండ‌వ‌ని ఆయ‌న విశ్లేషించారు. ఉప ఎన్నిక‌ల ఫ‌లితంతో ఫుల్ జోష్‌ లో ఉన్న టీఆర్ ఎస్ త‌ర‌ఫున కేటీఆర్ చెప్పిన జోస్యం నిజ‌మ‌వుతుందా? టీఆర్ ఎస్‌ కు సెమీ ఫైన‌ల్ వంటి ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఎలాంటి ప‌నితీరు చూపుతుంది అన్న‌ది మ‌రికొద్దినెల‌ల్లో తేలిపోనుంది.