Begin typing your search above and press return to search.

హ‌మ్మ‌య్య‌.. ఎన్టీఆర్ ను వ‌దిలేశారే కేటీఆర్!

By:  Tupaki Desk   |   14 Oct 2018 5:43 AM GMT
హ‌మ్మ‌య్య‌.. ఎన్టీఆర్ ను వ‌దిలేశారే కేటీఆర్!
X
ఎవ‌రైనా స‌రే.. మాకు తోచిన‌ట్లు తిట్టేస్తాం. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల ముందు మిగిలిన‌వ‌న్నీ చాలా చిన్న అంశాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం తెలంగాణ రాష్ట్ర అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఆయ‌న కుమారుడు క‌మ్ తాజా మాజీ మంత్రి కేటీఆర్ కు అల‌వాటు. దేశ తొలి ప్ర‌ధాని నెహ్రును ఉద్దేశించి దేశంలో మ‌రే పార్టీ అధినేత అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేసింది లేదు. కానీ.. ఆ లోటు కేసీఆర్ పుణ్య‌మా అని తీరిపోయింది.

ఆంధ్రోళ్లతో త‌మ‌కు లొల్లి లేద‌ని.. ఆంధ్రా ప్రాంత నేత‌ల‌తోనే లొల్లి అని చెప్పే కేసీఆర్‌.. తాజా ఎన్నిక‌ల ప్రచారం సంద‌ర్భంగా త‌న అస‌లు ముఖాన్ని చూపించారు. ఆంధ్రోళ్ల‌ను సైతం తిట్టేశారు. ఆంధ్రా.. తెలంగాణ‌ను క‌లిపి ఏపీని చేసింది నెహ్రు అంటూ తిట్టేసిన కేసీఆర్‌.. ఒక నిజాన్ని మాత్రం ప్ర‌స్తావించ‌కుండా దాచేశారు.

నెహ్రును అంత‌గా విమ‌ర్శించిన కేసీఆర్‌.. నిజాం క‌బంధ హ‌స్తాల నుంచి తెలంగాణ ప్ర‌జ‌ల ( హైద‌రాబాద్ స్టేట్ అంటే స‌రిపోతుంది) ను విముక్తి చేసింది ఎవ‌రు? అంటే నెహ్రునే. నాటి ప్ర‌ధానిగా ఉన్న ఆయ‌న వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌కు హైద‌రాబాద్ స్టేట్ సంగ‌తి చూడ‌మంటే.. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా స్వేచ్ఛ వ‌చ్చింద‌ని చెప్పాలి.

నిజానికి దేశ ప్ర‌జ‌లంద‌రికి బ్రిటీషోడి నుంచి స్వేచ్ఛ ల‌భించినా.. నాటి హైద‌రాబాద్ స్టేట్‌కు మాత్రం నిజాం నుంచి స్వాతంత్య్రం రాలేదు. నెహ్రు.. ప‌టేల్ పుణ్య‌మా అని వారు స్వేచ్ఛా వాయువుల్ని పీల్చారు. ఈ మాట‌ను కేసీఆర్ మాట‌ల్లో చెప్పాలంటే.. ఇది మేం చెబుతున్న స్టోరీ కాదు.. హిస్ట‌రీ. నిజం.. వాస్త‌వం. ఏ కాంపిటీటివ్ పుస్త‌కాల్ని తిర‌గేసినా.. చ‌రిత్ర‌ను చ‌దివినా.. గూగుల్ లో సెర్చ్ చేసినా ఇట్టే తెలిసిపోతుంది. నిజాం లాంటి నియంత నుంచి విముక్తి ప్ర‌సాదించిన నెహ్రును ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేందుకు సైతం కేసీఆర్ వెనుకాడ‌ని తీరు చూసిన‌ప్పుడు ఆంధ్రోళ్ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చు.

తాను న‌చ్చిన.. మెచ్చిన‌ వ్య‌క్తులు.. అది కూడా కాలానికి అనుగుణంగా మారే కేసీఆర్ మూడ్‌కు త‌గ్గ‌ట్లు విమ‌ర్శ‌లు.. పొగ‌డ్తలు చేస్తుంటారు. కేసీఆర్ నోటి బారిన ప‌డ‌ని తెలుగు నేత ఎవ‌రైనా ఉన్నారంటే అది ఎన్టీఆరే. ఆయ‌న మీద ఉన్న ఇష్టంతో త‌న కొడుక్కి తార‌క రామారావు అన్న పేరు పెట్టుకున్న కేసీఆర్‌.. ఎన్టీవోడి విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తండ్రే అంత జాగ్ర‌త్త‌గా ఉంటే.. కొడుకు కేటీఆర్ అదే బాట‌లో ప‌య‌నిస్తారు క‌దా. అందుకే..ఎన్టీఆర్ ను తిట్టే స్థానే.. పొగిడేశారు.

ఇప్పుడీ విష‌యాన్ని ఎందుకు ప్ర‌స్తావిస్తున్నామంటే.. ప్ర‌తి సీమాంధ్ర నాయకుడ్ని తిట్టేయ‌టం.. ఏదో ఒక మాట అన‌టం కేసీఆర్.. కేటీఆర్ ల‌కు మామూలే. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ ను ఇప్ప‌టికి మాట అన‌టం త‌ర్వాత‌.. ఆయ‌న్ను పొగిడేయ‌టం చూసిన‌ప్పుడు కాసింత సంతోషం ఖాయం. ఎందుకంటే.. తెలుగువారంద‌రికి అభిమాన పాత్రులైన ఎన్టీఆర్‌ను ఒక ప్రాంతానికి ప‌రిమితం చేసేలా.. సీమాంధ్ర ముద్ర వేయ‌కుండా ఆయ‌న్ను తెలుగువారంతా అభిమానిస్తార‌న్న స‌త్యాన్ని స‌త్యంగా ఒప్పుకోవ‌టం అది కూడా కేటీఆర్ కావ‌టం ఆస‌క్తిక‌రంగా అనిపించ‌క మాన‌దు. ఫ‌ర్లేదు.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎన్టీఆర్ అని విరుచుకుప‌డ‌కుండా తెలుగువారంద‌రికి ఎంతో అభిమాన‌పాత్రుడు ఎన్టీఆర్ అన్న చారిత్ర‌క స‌త్యాన్ని కేటీఆర్ చెప్ప‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్టీఆర్ పై విమ‌ర్శ‌లు చేస్తే.. మొద‌టికే మోసంగా మారుతుంద‌న్న భ‌య‌మే కేటీఆర్ చేత అలా మాట్లాడేలా చేసింద‌ని చెప్పాలి. అదే స‌మ‌యంలో.. ఎంత కాద‌న్నా త‌న తండ్రి ఎంతో ఇష్టుడైన ఎన్టీఆర్ ను తప్పు ప‌డితే ఆయ‌న హ‌ర్ట్ అవుతార‌న్న ఆలోచ‌న కూడా కేటీఆర్ చేత ఆచితూచి అన్న‌ట్లు మాట్లాడించి ఉండొచ్చు.