Begin typing your search above and press return to search.

ఈ ప్లాన్‌ తో కేటీఆర్ రంగంలోకి దిగుతార‌ట‌!

By:  Tupaki Desk   |   16 Dec 2018 6:30 AM GMT
ఈ ప్లాన్‌ తో కేటీఆర్ రంగంలోకి దిగుతార‌ట‌!
X
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడం, పరిపాలనపై పట్టు పెరుగడంతో టీఆర్ ఎస్‌ ను సంస్థాగతంగా బలోపేతంచేయాలని భావించిన అధినేత కేసీఆర్... కేటీఆర్‌ ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా నియ‌మించారు. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన సీఎం కేసీఆర్.. ఇకమీదట జాతీయ రాజకీయాలపై దృష్టిసారించనున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే కేటీఆర్ ఎంపిక జ‌రిగింది. అయితే, కేటీఆర్ ఏం చేయ‌నున్నారు? పార్టీ బ‌లోపేతం కోసం ఆయ‌న కృషి చేసే క్ర‌మంలో ఎంచుకున్న ప్రాధామ్య‌మైన అంశాలేంటి? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. పార్టీ అంశాల స‌మాచారం ప్ర‌కారం ప‌లు వ్యూహాల‌తో కేటీఆర్ ముందుకు సాగ‌నున్నారు.

పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే యువతను ప్రోత్సహించాలని నిర్ణయించిన కేసీఆర్ ఇందులో భాగంగా సమర్థుడైన కేటీఆర్‌ ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా నియమించారు. ఈ సంద‌ర్భంగానే టీఆర్ ఎస్‌ లో యువతతోపాటు సీనియర్లు సమపాళ్లలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని - పార్టీ బలోపేతానికి సీనియర్లు సహా అందరి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్ఠం చేసేందుకు కేటీఆర్ పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించనున్నారు. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్.. తెలంగాణ భవన్‌ లో పార్టీ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ ఎస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి లోక్‌ సభ నియోజకవర్గంలో ఒక ప్రధాన కార్యదర్శిని - ఇద్దరు లేదా ముగ్గురు కార్యదర్శులు - సహాయ కార్యదర్శులను ఇంచార్జీలుగా నియమించాలని - తెలంగాణభవన్‌ లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు స‌మాచారం.

టీఆర్ ఎస్‌ ను పటిష్ఠం చేసేందుకు రెండు సబ్‌ కమిటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం చేసి ఉన్నత విధానాలతో నివేదిక సమర్పించాల్సిందిగా ఈ సబ్‌ కమిటీలకు సూచించారు. త‌ద్వారా ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా - ప్ర‌తిష్టాత్మ‌కంగా టీఆర్ ఎస్ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. టీఆర్ ఎస్ అనుబంధ సంఘాల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు పూర్తిస్థాయి కార్యవర్గాలను నియమించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అత్యాధునిక వసతులతో పార్టీకి అన్ని జిల్లాల్లో సొంత కార్యాలయాలను ఏర్పాటుచేయాలని కేటీఆర్ నిర్ణయించారు. టీఆర్ ఎస్ సభ్యత్వ నమోదును ఫిబ్రవరిలో చేపట్టనున్నట్టు వెల్ల‌డించ‌డం ద్వారా వెంట‌నే త‌మ ముద్ర‌ను చాటుకునే కార్య‌చ‌ర‌ణ‌కు ఓకే చెప్పేశారు.