Begin typing your search above and press return to search.

కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల గుట్టు విప్పిన కేటీఆర్‌

By:  Tupaki Desk   |   9 Nov 2018 4:33 PM GMT
కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల గుట్టు విప్పిన కేటీఆర్‌
X
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది టీఆర్ ఎస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేషనల్ టీవీ ఛానెల్ సీఎన్ ఎన్-న్యూస్18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు సంపూర్ణమైన మద్దతు ఉందని పేర్కొన్నారు. మహాకూటమిని ప్రజలు తిరస్కరిస్తున్నారని.. కూటమి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడిస్తారని చెప్పారు.

శుక్రవారం మంత్రి కేటీ రామారావు సీఎన్ ఎన్‌ న్యూస్‌ 18 చానల్‌తో మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పనైపోయిందన్న ఆయన ఆ పార్టీకి ఊపిరిలూదేందుకు కూటమి పేరుతో చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పూర్తి నిరాశలో కూరుకుపోయిన చంద్రబాబు దీన్నొక అవకాశంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్‌ గెలుస్తూ వస్తుందని ఆయ‌న తెలిపారు. ``మినీ జనరల్‌ ఎలక్షన్స్‌ గా చెప్పుకున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నుంచి పలు చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ఫలితాల్లోనూ ఎలాంటి తేడా ఉండబోదు. ఇదే విషయాన్ని గడిచిన రెండు నెలల్లో 7సర్వేలు వెల్లడించాయి. స్పష్టమైన ఆధిక్యంతో టీఆర్ ఎస్‌ గెలుస్తుందని.. మూడింటా రెండు వంతుల సీట్లు సాధిస్తుందని ప్రకటించాయి. గెలుపు మాదే అనే పూర్తి నమ్మకంతో ఉన్నాం.`` అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ రాజకీయాల గురించి మంత్రి కేటీఆర్ వివ‌రించారు. దేశ పాలనలో కాంగ్రెస్‌ - బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయని - అందుకే తమ నేత కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించామన్న కేటీ రామారావు - జనవరి తర్వాత దేశ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తామని - జనవరి తర్వాత పెను మార్పులు జరుగుతాయని వెల్లడించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ జెండా ఎగుర వేయడంతో పాటు, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో 15 సీట్లు కైవసం చేసుకొని కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. ``మా వైఖరి ముందు నుంచి ఒకటే ఉంది. ఇప్పటి వరకు దేశ ప్రజలందరూ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌ - బీజేపీలను నమ్ముతూ వచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 71 ఏండ్లు దేశాన్ని పాలించాయి. పాలనలో పూర్తిగా విఫలం అయ్యాయి. ఎన్నో సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. సమస్యల వలయంలో గ్రామాలు చిక్కుకొని ఉన్నాయి. బీజేపీ - కాంగ్రెస్‌ పార్టీలు రెండు ఈ పరిస్థితికి కారణం. అందుకే మేము రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కావాలని అంటున్నాము. పూర్తి స్థాయిలో సహకార సమాఖ్య అమలు గురించి మాట్లాడుతున్నాము. భారత్‌ అన్ని రంగాల్లో దూసుకుపోవాలి. మరింత ధృడంగా మారాలి. ఇదే సమయంలో రాష్ట్రాలు కూడా అదే వేగంతో అభివృద్ధి చెందాలి. ఇవి సాధ్యపడాలనే మా లీడర్‌ కేసీఆర్‌ సహకార సమాఖ్య నినాదాన్ని తెరపైకి తెచ్చారు`` అంటూ కేటీఆర్ త‌మ పార్టీ నేత జాతీయ రాజ‌కీయాల అరంగేట్రం గురించి స్ప‌ష్టం చేశారు.