Begin typing your search above and press return to search.

సీఎల్పీ కార్యాల‌యానికి వెళ్లిన కేటీఆర్?

By:  Tupaki Desk   |   23 Feb 2019 7:16 AM GMT
సీఎల్పీ కార్యాల‌యానికి వెళ్లిన కేటీఆర్?
X
ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష కార్యాల‌యానికి వెళ్లారు. రెండు పార్టీలు ఢీ.. అంటే ఢీ అంటూ త‌ల‌ప‌డే వేళ‌.. అందుకు భిన్నంగా అధికార‌ప‌క్ష పార్టీకి అధ్య‌క్షుడ‌న్న బ‌డాయి అన్న‌ది లేకుండా సాదాసీదాగా కేటీఆర్ సీఎల్పీ ఆఫీసుకు రావ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఇంత‌కూ సీఎల్పీ ఆఫీసుకు కేటీఆర్ ఎందుకు వెళ్లిన‌ట్లు? అంటే.. దానికి కార‌ణం లేక‌పోలేదు. డిప్యూటీ స్పీక‌ర్ అభ్య‌ర్తిగా టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా ప‌ద్మారావు గౌడ్ బ‌రిలోకి దిగుతున్న వేళ‌.. ఆయ‌న విజ‌యం కోసం కేటీఆర్ సంప్ర‌దింపులు జ‌రిపారు. వాస్త‌వానికి సంప్ర‌దింపులు జ‌ర‌పాల్సిన అవ‌స‌రం లేదు. అధికార‌ప‌క్షానికి అవ‌స‌ర‌మైన దాని కంటే ఎక్కువ బ‌లం ఉంది. అయిన‌ప్ప‌టికీ.. మ‌ర్యాద‌పూర్వ‌కంగా.. అడ‌గ‌లేద‌న్న మాట అనిపించుకోకుండా ఉండ‌టానికి వీలుగా సీఎల్పీ ఆఫీసుకు కేటీఆర్ వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు.

సీఎల్పీ ఆఫీసుకు వ‌చ్చిన కేటీఆర్ ను సీఎల్పీ అధినేత భ‌ట్టి విక్ర‌మార్క ప‌లుక‌రించారు. కుశ‌ల ప్ర‌శ్న‌ల అనంత‌రం.. పార్టీ నిర్ణ‌యాన్ని ఉత్త‌మ్ తో మాట్లాడిన చెబుతాన‌ని భ‌ట్టి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక లేకుండా ఏక‌గ్రీవం చేయాల‌న్న కేటీఆర్ ప్ర‌తిపాద‌న‌పై భ‌ట్టి ఆస‌క్తిక‌ర ప్ర‌తిపాద‌న‌ను తెచ్చినట్లుగా తెలుస్తోంది.

త్వ‌ర‌లో జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే కోటాలో భాగంగా త‌మ‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. దీనికి కేటీఆర్ నుంచి ఎలాంటి స్పంద‌న లేద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. భ‌ట్టితో భేటీ అయిన అనంత‌రం.. టీ కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ ను కేటీఆర్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ చోటు చేసుకుంది.

త‌న ఫోన్ నెంబ‌రును ఎందుకు బ్లాక్ చేశారంటూ కేటీఆర్ ను ఉత్త‌మ్ ప్ర‌శ్నించ‌గా.. దీనికి ఆయ‌న బ‌దులిస్తూ.. మీ నెంబ‌ర్ని బ్లాక్ చేయ‌గ‌ల‌నా? అంటూ స‌మాధానం చెబుతూ.. తాను కేవ‌లం మెసేజ్ లు మాత్ర‌మే చూస్తాన‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసేందుకు కేటీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. గెలిచే అవ‌కాశం నూటికి నూట‌యాభై శాతం ఉన్నా.. అంద‌రిని క‌లుపుకు వెళ్లాల‌న్న ఆలోచ‌న త‌మ‌కున్న భావ‌న‌ను క‌లుగ‌జేసేందుకే కేటీఆర్ తాజా తీరులో వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.