మీడియా.. నిఘా వర్గాలతో లోటస్ పాండ్ కిటకిట

Wed Jan 16 2019 15:07:32 GMT+0530 (IST)

చప్పగా సాగిపోతున్నట్లుగా కనిపించిన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక్కసారిగా హుషారొచ్చింది. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భేటీ కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఆదేశంతో జగన్ తో భేటీ కావాలని కేటీఆర్ కు ఆదేశించగా.. ఆయన సమయాన్ని కోరటం.. అందుకు సానుకూలంగా జగన్ స్పందించటం తెలిసిందే.ఈ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జగన్ నివాసమైన లోటస్ పాండ్ వద్దకు కేటీఆర్ చేరుకున్నారు. వీరిద్దరి భేటీ అంశాన్ని లైవ్ లో చూపించేందుకు మీడియా పెద్ద ఎత్తున చేరుకుంది. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలించేందుకు.. ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించేందుకు ఏపీ నిఘా వర్గాలు లోటస్ పాండ్ వద్దకు చేరుకున్నాయి.

లోటస్ పాండ్ వద్ద జరుగుతున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు విజయవాడకు తెలియజేస్తున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సైతం ఏపీ నిఘా విభాగాలకు చెందిన ఉద్యోగులు ఏపీ ప్రభుత్వాధినేత చంద్రబాబు కోసం పని చేసినట్లుగా విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా విపక్ష ఇంటి వద్ద నిఘా వర్గాల హడావుడిపై పలువురు తప్పు పడుతున్నారు. ఇక.. మీడియా వర్గాల హడావుడి సాధారణం కంటే రెట్టింపు ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు.