Begin typing your search above and press return to search.

జంపింగ్ ల‌కు ఆహ్వానం ప‌లికిన కేటీఆర్‌

By:  Tupaki Desk   |   3 Dec 2016 4:46 AM GMT
జంపింగ్ ల‌కు ఆహ్వానం ప‌లికిన కేటీఆర్‌
X
కేసీఆర్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల‌ స్వల్ప వ్యవధిలోనే ప్రజల అచంచల విశ్వాసాన్ని చూరగొందని రాష్ట్ర ఐటీ - పరిశ్రమలు - పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. అభివృద్ధిని - సంక్షేమాన్ని రంగరించి దేశం యావత్తూ మనవైపు ఆసక్తిగా చూసేలా జనరంజక పాలన సాగిస్తున్నామని ఆయన అన్నారు. రెండున్న‌రేళ్ల ప‌రిపాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌కు కేటీఆర్ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి ప్రజల హితం తప్ప మరో ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు - వ్యవసాయం - నీటిపారుదల - విద్యుత్తు - తాగునీరు - విద్య - వైద్య రంగాల్లో భారీ ప్రణాళికలతో అనేక మైలురాళ్లు దాటుతూ ముందుకు వెళుతున్నామ‌ని అన్నారు. మన పథకాలకు దేశం అబ్బురపడుతుంని కేటీఆర్‌ తెలిపారు. ఏక కాలంలో 21 జిల్లాల ఏర్పాటుపై హర్యానా సీఎస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. నోట్ల రద్దు అంశంలో సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞుడిలాగ వ్యవహరించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సలహాల వల్లనే ప్రభుత్వ చెల్లింపులకు పాతనోట్లకు అనుమతి - రైతులకు 24 వేల నగదు - పీఓఎస్ మెషిన్ల దిగుమతిపై ట్యాక్సుల మిహాయింపు వంటి అంశాల్లో కేంద్రం నిర్ణయం తీసుకుందని కేటీఆర్‌ చెప్పారు.

ఇతర పార్టీల వారు టీఆర్ ఎస్‌ లో చేరడం త‌మ‌పై పెరిగిన విశ్వాసానికి ప్రతీకగా భావిస్తున్నామ‌ని కేటీఆర్ విశ్లేషించారు. "ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించారు కనుక ఆయన సారథ్యంలో పని చేద్దామని వస్తుంటారు. అలా వస్తున్నవారి మొహంపై తలుపులు మూసేయలేం. వద్దని చెప్పలేం. ఎవరి ఒత్తిడి లేకుండా వాళ్ళంతట వాళ్ళు వస్తే తప్పేంటి? చూడండి... పీసీసీ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వాళ్లు కూడా వస్తున్నారు. కాదంటామా? ఇక న్యాయాన్యాయాలు అంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. స్పీకర్‌ గారు తన పని తాను చేసుకుపోతారు" అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. త‌ద్వారా జంప్ జిలానీల‌కు త‌లుపులు తెరిచే ఉంటాయ‌నే సంకేతాన్ని ప‌రోక్షంగా అందించారు.

కాగా...తెలంగాణ కంటే ముందు ఏర్పడిన జార్ఖండ్ - ఉత్తరాఖండ్ - చత్తీస్‌ గఢ్‌ లు ఇప్పటికీ సమస్యల మధ్య ఉనికిని నిలుపుకోవటానికి తంటాలు పడుతున్నాయని కేటీఆర్ విశ్లేషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై స్వల్పకాలమే గడిచినా రాష్ట్రంలో స్థిరత్వం- బ్రహ్మాండమైన అభివృద్ధితో ముందుకు సాగుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. అతి స్వల్పకాలంలోనే ప్రపంచం అబ్బురపడేలా పనిచేశామ‌ని - పెట్టుబడులు - శాంతిభద్రతలు - విద్యుత్ సమస్య విషయాల్లో ఉమ్మడి పాలకులు లేవనెత్తిన అనుమానాలన్నీ స్థానిక యువతకు ఉద్యోగం - ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగామ‌ని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్న సంగతిని అంగీక‌రించిన కేటీఆర్ ఇప్పటివరకు 62వేల ఉద్యోగాలను టీఎస్‌ పీఎస్‌ సీ - జెన్‌ కో - ట్రాన్స్‌కో - పోలీసు బోర్డు ద్వారా భర్తీ చేశామ‌న్నారు. గతంలో ఏపీపీఎస్‌ సీ నియామకాలు అంటే ఏళ్ల‌ పాటు నిరీక్షణ - లంచాల బాగోతాల చరిత్ర. ఇంటికో ఉద్యోగం అని తామెప్పుడూ చెప్పలేదని, అది టీడీపీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్న మాటల‌ని తెలిపారు. బాబు వస్తాడు.. జాబు వస్తుంది అన్నది వాళ్ల నినాదమ‌ని, తాము లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయే తప్ప రైతులకు స్పష్టత ఉందని కేటీఆర్ తేల్చిచెప్పారు. రూ.17వేల కోట్ల భారీ రుణమాఫీని ఏ ప్రభుత్వం కూడా ఏకకాలంలో చేయలేదని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే రూ.12,500 కోట్ల మాఫీ పూర్తయిందని, మిగిలింది స్వల్పమ‌ని తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల మాపీ హామీ ఇచ్చినా ప్రజలు కేసీఆర్‌ నే నమ్మారని, ఆ నమ్మకాన్ని నిలుపుకుంటామ‌ని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/