Begin typing your search above and press return to search.

పార్టీలో చేర‌కున్నా.. చేతికి గులాబీ బీఫారాలు ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   23 April 2019 5:30 AM GMT
పార్టీలో చేర‌కున్నా.. చేతికి గులాబీ బీఫారాలు ఇచ్చేశారు
X
కంటికి క‌నిపించేవే నిజాలు అనుకుంటే అంత‌కు మించిన పొర‌పాటు మ‌రొక‌టి ఉండ‌దు. మ‌నం చూసేది.. మ‌న‌కు క‌నిపించే దాని వెనుక ఎన్నో ప‌రిణామాలు జ‌రుగుతాయి. అవేమీ బ‌య‌ట‌కు రావు. అందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ఎపిసోడ్ ను చెప్పాలి. సోమ‌వారం రాత్రి ఆయ‌న టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను క‌లిశారు.

గండ్ర‌తో పాటు.. ఆయ‌న స‌తీమ‌ణి జ్యోతి కూడా పార్టీలో చేరేందుకు ఓకే చెప్పేశారు. పార్టీలో చేర‌నున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న చేయ‌టం.. మంచి రోజు చూసుకొని పార్టీలో చేర‌తాన‌ని చెప్పిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి.. పార్టీలో చేర‌క‌ముందే పార్టీకి చెందిన బీఫారాలు గండ్ర చేతికి ఎలా వ‌చ్చాయి? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. పైకి క‌నిపించిన‌ట్లుగా గులాబీ పార్టీలో చేరాల‌న్న నిర్ణ‌యాన్ని గండ్ర అప్ప‌టిక‌ప్పుడు తీసుకోలేదు. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు లోగుట్టుగా ముందు నుంచి జ‌రుగుతున్నాయి.

స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో వెంట‌నే పార్టీలో చేరాల‌న్న సంకేతాలు అంద‌టంతో.. హ‌డావుడిగా కేటీఆర్ ను క‌లిసిన‌ట్లుగా తెలుస్తోంది. ప‌ద‌వుల‌కు సంబంధించి చిన్న‌పాటి అసంతృప్తి గండ్ర‌కు ఉండ‌టం.. దీన్ని గుర్తించిన టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వం ఆయ‌న‌కు చీఫ్ విప్ ప‌ద‌వి.. ఆయ‌న స‌తీమ‌ణికి జెడ్పీ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చేందుకు రెఢీ అయ్యింది. దీంతో గులాబీ పార్టీలో చేర‌టానికి గండ్ర‌కు ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది.

ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. పార్టీలో చేర‌తాన‌న్న సంసిద్ధ‌త‌కే గండ్ర ఫ్యామిలీ చేతికి భూపాల‌ప‌ల్లి అసెంబ్లీ ప‌రిధిలోని స్థానిక సంస్థ‌ల‌కు పోటీ చేసే టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌కు ఇవ్వాల్సిన బీఫారాల్ని అంద‌జేశారు. పార్టీలో అధికారికంగా చేర‌న‌ప్ప‌టికి బీఫారాలు ఇచ్చేసిన తీరు చూస్తే.. టీఆర్ ఎస్ అధినేత వ్యూహం ఎంత ప‌క్కాగా ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. పార్టీలో చేర‌కున్నా.. న‌మ్మి చేతికి పార్టీ బీఫారాలు ఇచ్చిన వైనాన్ని గండ్ర ఎప్ప‌టికి మ‌ర్చిపోలేరు క‌దా? త‌న మీద పెట్టిన న‌మ్మ‌కానికి ఎప్ప‌టికి విధేయుడిగా ఉండేలా చేసిన ప్లానింగ్ చూస్తే కేసీఆరా.. మ‌జాకానా అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.