Begin typing your search above and press return to search.

సొంత అడ్డాలో కేటీఆర్ కు షాకింగ్ అనుభవం

By:  Tupaki Desk   |   26 Sep 2016 6:31 AM GMT
సొంత అడ్డాలో కేటీఆర్ కు షాకింగ్ అనుభవం
X
కోరి మరీ తుండును కంప మీద వేసుకోవటం మంత్రి కేటీఆర్ కు మాత్రమే చెల్లిందేమో. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అవసరం లేకున్నా కల్పించుకున్న‌ ఆయన ఇప్పుడు చింతించే పరిస్థితి. కొత్త జిల్లాల ప్రకటన సందర్భంగా సిరిసిల్ల జాబితాలో లేదు. అయితే.. తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒత్తిడికి గురి చేసి మరీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను జిల్లాగా ప్రకటించుకునేలా చేయటంలో ఆయ‌న‌ సక్సెస్ అయ్యారని చెబుతారు. అయితే.. సిరిసిల్లను జిల్లా చేయటం వల్ల ఎలాంటి లాభం లేకపోగా.. నష్టమే ఎక్కువన్న విషయాన్ని కేసీఆర్ కు అర్థమయ్యేలా చెప్పిన అధికారుల మాటతో కొత్త జిల్లాల లిస్ట్ నుంచి సిరిసిల్లను తీసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయాన్ని కొడుక్కి వివరంగా చెప్పటం ద్వారా కేసీఆర్ తన పని తాను పూర్తి చేశారు.

కొడుకును సంతృప్తి పరచినంత‌ ఈజీ కాదు.. సిరిసిల్ల ప్రజల్ని సంతోష పెట్టటమన్న విషయం తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. సిరిసిల్లను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయటం సాధ్యం కాదన్న విషయాన్ని కేటీఆర్ అర్థం చేసుకున్నా.. సిరిసిల్ల ప్రజలు మాత్రం నో అంటే నో అనేస్తున్నారు. అంతేకాదు.. సిరిసిల్ల జిల్లా సాధన ఐక్య కార్యాచరణగా ఏర్పడి మరీ మంత్రి కేటీఆర్ మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని షురూ చేశారు.

ఇదిలా ఉంటే.. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించటంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరిస్తూ బహిరంగ లేఖ రాసిన కేటీఆర్.. తన నియోజకవర్గ ప్రజల మనసుల్ని మార్చే ప్రయత్నం చేసినా.. అదేమీ వర్క్ వుట్ కాని పరిస్థితి. గడిచిన కొద్దిరోజులుగా సిరిసిల్లను ప్రత్యేక జిల్లా ఆందోళనలు అట్టుడుకి పోయేలా చేస్తున్నాయి. తాజాగా తన సొంత నియోజకవర్గానికి వచ్చిన మంత్రి కేటీఆర్ కు చేదు అనుబవం ఎదురైంది. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న కారు సిరిసిల్లకు చేరుకున్న వెంటనే.. సిరిసిల్ల జిల్లా సాధన సభ్యులు ఆయన కారును అడ్డుకున్నారు. అక్కడితో ఆగని వారు నిరసన నినాదాలు చేశారు.

మంత్రి కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన కారును ముందుకు పోనివ్వకుండా అడ్డుకున్న నిరసనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. అతి కష్టమ్మీద కేటీఆర్ కారు ముందుకు కదిలేలా చేశారు. సొంత అడ్డాలో జయ జయధ్వానాలకు భిన్నంగా డౌన్.. డౌన్ పరిస్థితి ఎదురుకావటం మంత్రి కేటీఆర్ కు సైతం కొత్త అనుభవంగానే చెప్పక తప్పదు.