Begin typing your search above and press return to search.

కొండా పేరు చెప్పి కోదండం సార్ ని తిట్టేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   26 Sep 2018 4:45 AM GMT
కొండా పేరు చెప్పి కోదండం సార్ ని తిట్టేసిన కేటీఆర్
X
ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ పైనా.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల పైనా ఎవ‌రూ చేయ‌న‌న్ని తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కొండా దంప‌తులు సంచ‌ల‌నం సృష్టించారు. ఆ మాట‌కు వ‌స్తే.. కేసీఆర్ ఫ్యామిలీపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన క్రెడిట్ కొండా సురేఖ‌కే ద‌క్కుతుంది. తాను త‌యారు చేసుకొచ్చిన 10 పేజీల బ‌హిరంగ లేఖ‌ను చ‌దివి వినిపించటం ద్వారా ఆమె పెను సంచ‌ల‌నానికే తెర తీశారు.

అధికార‌పార్టీలో ఉంటూ టీఆర్ ఎస్ అధినాయ‌క‌త్వాన్ని ఇంత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం ఇదే తొలిసారిగా చెప్పాలి. పార్టీ నుంచి వెళ్లిపోయే వారు విమ‌ర్శ‌లు మామూలే అయినా.. ఈ స్థాయిలో మాత్రం చాలా అరుదుగా చెప్పాలి. ఇక‌.. కేసీఆర్ అండ్ కో మీద‌న అయితే ఇదే మొద‌టిసారి అని చెప్పాలి.

కేసీఆర్ తో చెడి.. బ‌య‌ట‌కు వ‌చ్చిన నేత‌లు ఎంద‌రో ఉన్నా.. ఇంత తీవ్రంగా ఆరోప‌ణ‌లు.. ఘాటు విమ‌ర్శ‌లు చేసింది మాత్రం కొండా సురేఖేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కొండా దంప‌తులు వ్యాఖ్య‌లు తీవ్ర సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో.. వారి ఆరోప‌ణ‌ల్ని తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేశారు తాజా మాజీ మంత్రి కేటీఆర్‌.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీరు మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌రంగా క‌నిపించింది. కొండా దంప‌తుల్ని తిట్టే క్ర‌మంలో.. వారి కంటే కూడా తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షుడు కోదండం మాష్టారిని టార్గెట్ చేయ‌టం గ‌మ‌నార్హం. పేరుకు కొండా దంప‌తుల్ని తిట్టే ప్రోగ్రాం పెట్టిన‌ట్లు క‌నిపించినా.. టార్గెట్ మాత్రం కోదండం కావ‌టం చూస్తే.. కేటీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

పార్టీ నుంచి వెళ్లిపోయే వారు పోతూ పోతూ రాళ్లు వేయ‌టం స‌హ‌జ‌మేన‌ని తేల్చిన కేటీఆర్‌.. విమ‌ర్శ‌ల‌తో అవ‌త‌లి పార్టీ మెప్పు పొందే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. కొండా మీద మూడు ముక్కల్లో త‌న అభిప్రాయాన్ని చెప్పేసిన కేటీఆర్‌.. కోదండంపై నిప్పులు చెరిగారు. మ‌హా కూట‌మిలో కోదండం చేర‌టాన్ని త‌ప్పు ప‌ట్టిన కేటీఆర్‌.. కోదండ‌రాం ఆత్మ‌వంచ‌న చేసుకుంటున్నార‌న్నారు.

త‌మ‌కు ప్ర‌జాభిమానం ఉంద‌ని.. 119 స్థానాల్లో పోటీ చేస్తామ‌ని చెప్పిన కోదండ‌రాం.. నేడు ముష్టి 3 స్థానాల కోసం కాంగ్రెస్ చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నార‌న్నారు. ఇది ఏ ర‌క‌మైన ప్ర‌జాభిమాన‌మో చెప్పాల‌న్నారు. తెలంగాణ కోసం యువ‌త అమ‌రులు కావ‌టానికి కార‌ణ‌మైన పార్టీల‌తో కోదండం పార్టీ పొత్తుకు వెళ్ల‌టం సిగ్గుచేట‌న్నారు. ప‌ర‌స్ప‌ర విరుద్ద సిద్ధాంతాలు ఉన్న పార్టీలు నిస్సిగ్గుగా ఏక‌మ‌వుతున్న‌ట్లుగా మండిప‌డ్డారు. విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చి అధికారం కోసం వెంప‌ర్లాడుతూ కూట‌మి ఏర్పాటు చేశార‌న్నారు. ఎదుటోడ్ని త‌ప్పు ప‌ట్టే ముందు మ‌న త‌ప్పుల్ని చూసుకోవాలంటారు. అదే ప‌ని చేస్తే కేటీఆర్ నోటి నుంచి ఇన్ని మాట‌లు రావేమో? టీఆర్ ఎస్ ప్ర‌యాణాన్ని గుర్తు తెచ్చుకుంటే.. ప‌ర‌స్ప‌ర విరుద్ధ సిద్ధాంతాలు ఉన్న పార్టీల‌తో జ‌ట్టు క‌ట్టి.. కూట‌మిలో చేరిన ఉదంతాలెన్నో ఉన్న విష‌యాన్ని అంత సింఫుల్ గా మ‌ర్చిపోతే ఎలా కేటీఆర్?