Begin typing your search above and press return to search.

ఇంత‌కీ కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చిన మీడియా ఏది?

By:  Tupaki Desk   |   15 Dec 2018 12:35 PM GMT
ఇంత‌కీ కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చిన మీడియా ఏది?
X
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు త‌మ వారెవ‌రు...ప‌రాయి వారెవ‌రూ అనే క్లారిటీ ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా ఇటీవ‌ల జ‌రిగిన హోరాహోరీ పోరులో త‌మ‌కు హ్యాండిచ్చిన వారి విష‌యంలో కేటీఆర్ క్లారిటీతో ఉండ‌ట‌మే కాకుండా వారికి త‌గు రీతిలో స్పందించేందుకు త‌న ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస‌కుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్ మాట్లాడిన మాట‌లే. కొన్ని మీడియా సంస్థ‌లు టీఆర్ ఎస్‌ కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని అయితే...వారికి ప్ర‌జ‌లు త‌గు రీతిలో స్పందిస్తున్నార‌ని అన్నారు.

కొన్ని మీడియా సంస్థ‌లు ఒక ఎజెండాతో బలవంతంగా టీడీపీ అధ్యక్షుడిని, ప్రజలు లేని ప్రజా కూటమిని తెలంగాణపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశాయ‌ని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ``ఆ మీడియా సంస్థ‌లు వారికుండే శక్తినంతా వినియోగించి భయంకరమైన ప్రయత్నం చేశారు. మేము ప్రభుత్వాలు కూల్చగలం. ప్రభుత్వాలు తేగలం. నాయకులను తయారుచేయగలం. ధ్వంసం చేయగలం అనుకునే మీడియా సంస్థలకు తెలంగాణ ప్రజలు అనేకసార్లు బుద్ధి చెప్పారు. 2006లో కేసీఆర్ కరీంనగర్ లో పోటీ చేసినప్పటి నుంచి డబ్బు బలం, మీడియా బలంతో రకరకాల ప్రచారాలతో తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేసి.. తెలంగాణను రాకుండా అడ్డుకున్న శక్తులు ఏవైతో ఉన్నాయో వాటిని ప్రజలు ఆనాడే తిరస్కరించారు. మొన్న కూడా అసాధారణమైన, ఆశ్చర్యమైన పరిస్థితులు కనిపించాయి. క్షేత్రస్థాయిలో వేరే పరిస్థితి ఉంటే.. ప్రజాకూటమిని ప్రజలు గెలిపించారని - టీఆర్ ఎస్ పార్టీ దారుణంగా పరాభవం కాబోతుందని.. తాము కూడా కొన్ని సందర్భాల్లో అయోమయానికి గురయ్యే స్థాయిలో ప్రచారాలు చేశారు. ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మలేదు కానీ.. కాంగ్రెసోళ్లు బలంగా నమ్మారు కాబట్టి పరాజయం నుంచి కోలుకోలేకపోతున్నారు. ఎందుకు ఓడిపోయామని సమీక్షించుకోకుండా - ఆత్మవిమర్శ చేసుకోకుండా తాము చేసిన ప్రచారాన్ని తామే విశ్వసించి తమ బుట్టలో తామే పడి వారు క్రియేట్ చేసుకున్న మాయ ప్రపంచంలో పడిపోయి గందరగోళంలో ఉన్నారు` అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రజా చైతన్యం ముందుకు కుయుక్తులు - కుట్రలు - పన్నాగాలు ఫలించవని జనం సాక్షిగా తేలిపోయింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ``ఎవరెన్ని ప్రచారాలు చేసినా.. వారి విజ్ఞతకే వదిలేద్దామని చెప్పారు. మొత్తం అన్ని మీడియా సంస్థలు ఒకలా ఉంటే ఒక వ్యక్తి చేసిన సర్వేను పట్టుకొని దానికి అశేషమైన - విశేషమైన ప్రాచుర్యం కల్పించారు. భవిష్యత్ ను ముందు చూసే దార్శనికుడిలాగా ఆయనకు బిల్డప్ ఇచ్చి ఆయన చెప్పింది అయిపోతోందని మొన్నటి దాకా డబ్బాలు కొట్టారు. డబ్బాలు తెరవంగానే ఈవీఎంల మీద పడ్డారు. కాంగ్రెస్ మూడు రాష్ర్టాల్లో గెలిస్తే అక్కడ ట్యాంపరింగ్ ఉండదు.. ఇక్కడ అధికారంలోకి రాకపోయేసరికి ట్యాంపరింగ్ ఉంటుంది. ఇంగితజ్ఞానం లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. 2 కోట్ల మంది ఓటేస్తే మాకు 98 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు - టీఆర్ ఎస్ కు 42 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉంది. ఇక కొన్ని పత్రికలు - మీడియా సంస్థలు ప్రచారం చేసినా - ప్రతిపక్షాలు మాట్లాడినా వారి విజ్ఞతకే వదిలేద్దాం. తెలంగాణ కేంద్రంగా పని చేస్తోన్న పత్రికలను కాపాడుకునే దిశగా ముందుకు పోతాం` అని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే, పేరు పెట్ట‌కుండా కేటీఆర్ విమ‌ర్శించిన ఈ మీడియా సంస్థ‌లు ఎవ‌రనే చ‌ర్చ జ‌రుగుతోంది.