Begin typing your search above and press return to search.

ఈ ‘‘చనిపోవటం’’ మాటేమిటి కేటీఆర్..?

By:  Tupaki Desk   |   6 May 2016 2:40 PM GMT
ఈ ‘‘చనిపోవటం’’ మాటేమిటి కేటీఆర్..?
X
ఖమ్మం జిల్లా పాలేరు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక సంగతి తెలిసిందే. గెలుపే ధ్యేయంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అధికారపక్షం దూసుకెళుతోంది. తమ విజయం మీద మాంచి నమ్మకంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డియినట సతీమణి సుచరిత మీద తాము విజయం సాధించటం పక్కా అని చెబుతోంది. ఈ ఎన్నికల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పాలేరులో తమ పార్టీ విజయం ఖాయమంటున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు చనిపోయాయంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ తరహా వ్యాఖ్యలు పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు గుర్తించటం లేదు? ఒక పార్టీని దెబ్బ తీయటాన్ని హర్షించే వారంతా.. పార్టీల్ని నామరూపాలు చేస్తానన్న ప్రకటన పట్ల పాజిటివ్ గా రియాక్ట్ కారన్న నిజం కేటీఆర్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు.. సవాళ్ల విషయంలో తనదైన శైలిలో రియాక్ట్ అయ్యే కేటీఆర్.. పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా తమ రాజకీయ ప్రత్యర్థులు విసిరిన సవాళ్లకు పెద్దగా స్పందించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది.

మరోవైపు.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే పార్టీని గెలిచేలా చేస్తాయంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు చేసిన అభివృద్ధితో గెలుపు పక్కా అన్న నమ్మకమే ఉండి ఉంటే.. తమ పార్టీ అభ్యర్థి కమ్ మంత్రి తుమ్మల చేత రాజీనామా చేసి బరిలోకి దింపొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రిగా వ్యవహరిస్తూ.. పోటీ చేసే కన్నా..పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగే సత్తా ఉందా? అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ సవాలు విసిరిన తర్వాత కూడా స్పందించకపోవటాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రత్యర్థులు విసిరే సవాళ్ల మీద సీరియస్ గా రియాక్ట్ అయ్యే తెలంగాణ అధికారపక్షం పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా ఉత్తమ్ సవాలు మీద స్పందించకపోవటం ఏమిటన్న ప్రశ్నకు గులాబీ దళం సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి.