Begin typing your search above and press return to search.

పార్టీలన్నీ పిచ్చ లైట్ అనేస్తున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   19 March 2017 5:25 AM GMT
పార్టీలన్నీ పిచ్చ లైట్ అనేస్తున్న కేటీఆర్
X
ఆచితూచి మాట్లాడినట్లు కనిపించే తెలంగాణ అధికారపక్ష నేత.. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ మాటలు ఒక్కోసారి మహా దూకుడుగా ఉంటాయి. తాజాగా అలాంటి మాటలు ఆయన నోటి నుంచి వచ్చేశాయి. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ పిచ్చ లైట్ అన్నట్లుగా తీసి పారేశారు. తమ ప్రత్యర్థులంటూ ఎవరూ లేరన్నట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం. తమను తప్పు పడుతున్న విపక్షాల్ని ఈకల మాదిరి తీసి పారేస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉండటం గమనార్హం.

కరీంనగర్ రాజన్న జిల్లాలో కార్యకర్తల సమావేశాలు.. సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు ముఖ్యఅతిధిగా హాజరైన కేటీఆర్ కాంగ్రెస్ సహా తెలంగాణ లోని రాజకీయ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోనే సకల దరిద్రమైన పార్టీగా కాంగ్రెస్ ను అభివర్ణించారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు కాంగ్రెస్ నాయకత్వం నడుస్తోందన్నారు. పొరపాటున కానీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయి ఉంటే.. ఈ రోజున తెలంగాణ గంగలో కలిసి ఉండేదన్న కేటీఆర్.. తెలంగాణకు స్వీయ అస్థిత్వం కలిగిన టీఆర్ఎస్సే రక్షణగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ కోరుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

టీఆర్ఎస్ కు ఏకైక శత్రువు కాంగ్రెస్ పార్టీనేనని.. దానిని తరిమి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన కేటీఆర్.. చంద్రబాబు బిచాణ సర్దుకొని అమరావతిలో పడ్డారని.. టీడీపీ ఖేల్ ఖతం..దుకాణం బంద్ అని.. ఆ పార్టీ మళ్లీ వచ్చే అవకాశమే లేదని తేల్చేశారు. ఇక.. బీజేపీ.. సీపీఎం.. సీపీఐ పార్టీల వల్ల ఊదు కాలదు.. పీరీలు లెవవన్నారు.

రాష్ట్ర విభజన చట్టాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రాబాబు ఉల్లంఘించారని.. సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కరెంటు రాకుండా చేశారని.. ఖమ్మం జిల్లాల్లోని ఏడు మండలాల్ని అన్యాయంగా ఏపీలో కలుపుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన మొదలయ్యాక.. పది నెలల కాలం బాబు మాటల్ని నమ్మి ప్రధాని మోడీ ఇబ్బంది పెట్టారని.. అయినా తాము అలాంటి వాటిని తట్టుకొని నిలబడినట్లుగా చెప్పుకొచ్చారు. పార్టీలన్నింటిని తీసిపారేయటం బాగానే ఉన్నప్పటికీ.. ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా..సందేహాలు వ్యక్తమయ్యేలా కేటీఆర్ మాటలు చెబుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. ఎన్నికల నాటికి ఈ మాటల జోరు అంతకంతకూ ఎక్కువయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/