వాజ్ పేయి అంత్యక్రియలను కూడా వాడేసుకున్న కేటీఆర్!

Fri Aug 17 2018 22:25:26 GMT+0530 (IST)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించే ఏ అవకాశాన్ని కూడా కేటీఆర్ వదిలిపెట్టరు. అయితే రాష్ట్రంలోని అంశాల ఆధారంగానే ఇన్నాళ్లు స్పందించిన కేటీఆర్ తాజాగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియల ఉదంతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోసేందుకు ఉపయోగించుకున్నారు. వరుసగా రెండు ట్వీట్లు చేసి ఆ పార్టీ చేసిన నిర్వాకాన్ని ఎండగట్టారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలను బీజేపీ పార్టీ పరంగా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయానికి  ఆయన భౌతికకాయాన్ని తీసుకువచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆయనకు స్మతిస్థల్ లో మొమోరియల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ తమ పార్టీ నాయకుడిని చివరి గడియల్లో వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు - దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఆయన అంత్యక్రియలను ఆ పార్టీ నిర్వహించిన తీరు ...కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కూడా ఆగ్రహాన్ని కలిగించింది. ఒక సుప్రసిద్ధుడిని ఘోరంగా అవమానించిన తీరును ఇప్పటికీ అంతా గుర్తు చేసుకుంటారు. తాజాగా ఇదే అభిప్రాయంతో సుప్రసిద్ధ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఓ ట్వీట్ చేశారు.

‘అటల్ జీకి తన అంతిమ యాత్రలో బీజేపీ న్యాయం చేస్తోంది. దివంగత పీవీ నరసింహరావు విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోయింది. భారతదేశానికి చెందిన ప్రధానుల జాబితాలో అటల్ జీకి తగు గౌరవం దక్కింది’ అని రాజ్ దీప్ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ పీవీ నరసింహారావు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్తం చేసుకోలేదనే రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. మరో నెటిజన్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ...`` గొప్ప వ్యక్తిత్వం కలిగిన పీవీ నరసింహారావుగారిని ఆయన చివరి గడియల్లో కాంగ్రెస్ నేతలు ఘోరంగా అవమానించారు. ఈ పరిణామంపై స్పందించే హుందాతనం లేదా ధైర్యం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లేదు. తెలంగాణతో పాటుగా మరే ప్రాంతంలోని నేతలనైనా...తమ చర్యలను ప్రశ్నించవద్దనే రీతిలో కాంగ్రెస్ హైకమాండ్ తయారు  చేసినట్లు ఉంది. వెన్నెముక లేని నాయకులు వీళ్లు`` అంటూ కేటీఆర్ ఘాటుగా రియాక్టయ్యారు.