Begin typing your search above and press return to search.

వెంక‌య్య ఇష్యూ -కేటీఆర్ క్లారిటీ

By:  Tupaki Desk   |   25 July 2017 10:40 AM GMT
వెంక‌య్య ఇష్యూ -కేటీఆర్ క్లారిటీ
X
బీజేపీ అగ్ర‌నేత - ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి వెంక‌య్య‌నాయుడుకు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు వ్యాపార సంబంధాలున్నాయ‌న్న కాంగ్రెస్ జాతీయ నేత జైరామ్ ర‌మేశ్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. తాజాగా అసెంబ్లీలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ విపక్షాలు గోబెల్స్ లా వ్యవహరిస్తున్నాయని మండిప‌డ్డారు. ప్రతిపక్షాలకు సమస్యలు లేవని...అందుకే నాన్ ఇష్యూ లను ఇష్యూలు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ వి లత్కోర్ రాజకీయాలని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ది జూట్....లూట్ - స్కూట్ సిద్ధాంతమ‌ని కేటీఆర్ విరుచుకుప‌డ్డారు.

కాంగ్రెస్ నేత‌ జై రామ్ రమేష్ తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలీసు వాహనాల కొనుగోలులో గత యూపీఏ విధానాన్నే తాము పాటించామ‌ని అన్నారు. త‌న‌కు ఎలాంటి వాహనాల సంస్ధలు లేవని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఆరేడు ఏళ్ళ కిందట ట్రాక్టర్లకు సంబంధించిన సంస్థ ఉండేదని...ఇప్పుడది కూడా లేద‌ని కేటీఆర్ తెలిపారు. ఒక‌వేళ కంపెనీ ఉంద‌ని నిరూపిస్తే ఆరోప‌ణ‌లు చేసే వారికే రాసిస్తాన‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడుకు చెందిన‌ స్వర్ణభారతి ట్రస్టుకు పన్ను మినహాయింపులు తప్పేమికాదని అన్నారు. గతంలో ఎన్నింటికో కాంగ్రెస్ హాయంలో పన్ను మినహాయింపులు ఇచ్చారని గుర్తు చేశారు. ``జై రామ్ అనే పెద్ద మనిషి ఎపుడైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారా?దిగ్విజయ్ లాంటి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నిరూపించమని అడిగితే అది తమ పని కాదంటున్నారు ..బురద జల్లడమే మీ పని. తప్పుడు ఆరోపణలు చేస్తే ఎంత పెద్ద నేతలైనా వదలం`` అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ హాయంలో బకాసురుల లాగా ఇసుకాసుర పాలన సాగిందని కేటీఆర్ మండిప‌డ్డారు. .ఇసుక మీద రావాల్సిన నాలుగు వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో ఉత్తమ్ బొక్కాడా ?జానా రెడ్డి బొక్కాడా ?జీవన్ రెడ్డి బొక్కాడా ? చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల రూపాయల ఇసుక ఆదాయాన్ని ఆరు వందల కోట్లకు పెంచినందుకు కాంగ్రెస్ నేతలకు అక్కసా అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోవడం మానేసి చాలా కాలమైందని కేటీఆర్ అన్నారు. ఉత్తమ్ సిరిసిల్లా వెళ్ళి ఏం చెబుతాడని కేటీఆర్ ప్ర‌శ్నించారు. సిరిసిల్లా ఉదంతం పై విపక్షాలు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాయని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. వాస్త‌వాలు అన్నీ విచారణ లో తేలుతాయని అన్నారు. సీబీఐ విచారణ ఎదుర్కుంటున్న నేతలతో కలిసి ఉత్తమ్ ప్రెస్ మీట్ పెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ కు శంకరగిరి మాన్యాలే గతి అని కేటీఆర్ జోస్యం చెప్పారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల స‌మ‌యంలో సవాల్ విసిరి చెవు కోసుకోకుండా పారిపోయిన సీపీఐ నారాయణ త‌న‌ను వీరప్పన్ తో పోలుస్తున్నార‌ని ఆయ‌న‌కు సిగ్గుండాలని కేటీఆర్ విమ‌ర్శించారు.