Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌జ‌లు తెలుసుకోండి..హోదాపై బాబుకు నో క్లారిటీ

By:  Tupaki Desk   |   15 Dec 2018 3:30 PM GMT
ఏపీ ప్ర‌జ‌లు తెలుసుకోండి..హోదాపై బాబుకు నో క్లారిటీ
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు గురించి మ‌రోమారు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట‌య్యారు. చంద్ర‌బాబు మాట మార్చే తీరును - ఇటీవ‌ల ఆయ‌న ఎత్తుకున్న జాతీయ రాజ‌కీయాల గ‌ళాన్ని కేటీఆర్ తిప్పికొట్టారు. మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని.. చంద్రబాబు మాత్రం తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు . దేశ రాజకీయాల్లోకి వెళుతున్నప్పుడు ఆంధ్రలో కూడా ఉంటాం కదా అని ఎదురు ప్రశ్నించారు. ఏపీ అనేది దేశంలో అంతర్భాగం అని.. అదేదో పరాయి దేశంలో ఉన్నట్లు అభివర్ణించటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. అదే పార్టీతో కలిసిపోవటంపై తెలుగుదేశం పార్టీ నేతలే ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రత్యేక హోదా అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారని.. ప్రజలను కూడా గందరగోళంలో పడేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒకసారి హోదా సంజీవనా అంటారు.. మరోసారి హోదా కావాలి అంటారు.. ఇలా ఒక క్లారిటీతో లేకుండా ఉన్నారని.. ఏపీ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రజలు ఈసారి ఆలోచించి ఓటు వేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా ప్రచారం ఒకలా ఉంటే.. ప్రజలు మరోలా ఆలోచిస్తున్నారన్న విషయం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టం అయ్యిందని వివరించారు. చంద్రబాబు గొప్ప నేతగా మీడియా మాత్రమే కీర్తిస్తుందని.. ప్రజలు కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయనకు ప్రజల్లో అంత చరిష్మా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన తిరిగిన అన్ని ప్రాంతాల్లోనూ ఎందుకు ఓడిపోతుందని ప్రశ్నించారు. ఆయన్ను ఓ వర్గం మీడియా - అనుకూల మీడియా ఎక్కువ చేసి చూపుతుందని వివరించారు. నిజాన్ని చెప్పాల్సిన బాధ్యత పత్రికలు - టీవీలపై ఉందన్నారు.