Begin typing your search above and press return to search.

చెల్లెలు తిట్టింది... అన్న రిక్వెస్ట్ చేశాడు..

By:  Tupaki Desk   |   30 Sep 2016 5:11 AM GMT
చెల్లెలు తిట్టింది... అన్న రిక్వెస్ట్ చేశాడు..
X
తెలంగాణ అధికారపక్షం తీరు భలే చిత్రంగా ఉంటుంది. ఒక నోటితో తిట్టేస్తూనే.. మరో నోటితో సాయం అడిగే సత్తా వారి సొంతం. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్ర సాయం కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పటమే కాదు.. జరిగిన నష్టంపై ఒక నివేదిక తయారు చేయాలని అధికారుల్నిఆదేశించారు కూడా. అంతలోనే సీన్లోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాదు ఎంపీ కవిత వెంకయ్యపై విమర్శలు చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్ని వెంకయ్య సమానంగా చూడాలని.. అందించే సాయం సమానంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఒక ప్రకృతి విపత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా జరగలేదన్న విషయాన్నికవిత మర్చిపోయారు. ఎలాంటి సాయం చేసినా సరే.. ఏపీతో సమానంగా తెలంగాణకు ఇవ్వాలన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. అంతేకాదు.. సాయం అడుగుతున్న నోటితోనే వెంకయ్యపై విమర్శలు చేయటాన్ని పలువురు బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు.

కవిత తీరు ఇలా ఉండే.. ఆమె సోదరుడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాత్రం హుందాగా వ్యవహరించటం గమనార్హం. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్యను కలిసిన కేటీఆర్.. వర్షాల కారణంగా.. హైదరాబాద్ తో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లిందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వర్షాల కారణంగా తమకు జరిగిన నష్టానికి కేంద్రం నుంచి రూ.1189 కోట్ల సాయం అందించాలంటూ ఆయన కోరారు.

ఇదిలా ఉంటే.. కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి కేటీఆర్ వినతికి కేంద్రమంత్రి వెంకయ్య సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నుంచి నష్టానికి సంబంధించిన నివేదిక అందిన వెంటనే.. ఈ అంశంపై దృష్టిపెట్టి తగురీతిలో రియాక్ట్ అవుతామని ఆయన చెప్పారు. ఏమైనా చెల్లెలు తిట్టిపోసిన వ్యక్తిని.. తెల్లారేస‌రికి అన్న‌ వెళ్లి కలిసి రూ.1189 కోట్ల సాయాన్ని అడగటం మాత్రం కేసీఆర్ కుటుంబానికే చెల్లుతుందన్న విమర్శలు కమలనాథుల నుంచి వినిపించటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/