Begin typing your search above and press return to search.

మెట్రోనే కాలే... అప్పుడే మోనోనా?

By:  Tupaki Desk   |   20 Feb 2018 7:34 AM GMT
మెట్రోనే కాలే... అప్పుడే మోనోనా?
X
భాగ్య‌న‌గ‌రి హైద‌రాబాదులో మెట్రో రైలు క‌ల నెర‌వేర‌డానికి ప‌ట్టిన స‌మ‌యం గుర్తుందా? స‌రిగ్గా గుర్తు లేదు గానీ... ఏళ్ల స‌మ‌య‌మే ప‌ట్టింద‌ని చెప్పాలి. ఎన్నేళ్లు అంటే... సుమారుగా ఓ 20 ఏళ్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎప్పుడో ఉమ్మ‌డి రాష్ట్రానికి టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సీఎంగా ఉండ‌గా మొగ్గ తొడిగిన మెట్రో ఆలోచ‌న... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత గానీ అడుగు ముందుకు ప‌డ‌లేదు. అన్ని అనుమ‌తులు ల‌భించి భూసేకర‌ణ పూర్త‌య్యే స‌రికే చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే వైఎస్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెంద‌గా, ఆ త‌ర్వాత ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంలుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొణిజేటి రోశ‌య్య గానీ, న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి గానీ ఈ ప్రాజెక్టుపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేద‌నే చెప్పాలి. అయితే అప్ప‌టికే టెండ‌ర్లు పూర్తి కాగా... ఉదో పనులు కొనసాగుతున్నాయంటే.. కొన‌సాగాయి త‌ప్పించి... మెట్రో ప‌నుల్లో ఏమాత్రం పురోగ‌తి లేద‌ని చెప్పాల్సిందే.

ఇక 2014 తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోవ‌డం, హైద‌రాబాదు రాజ‌ధానిగా కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు కావ‌డం, ఆ రాష్ట్రానికి టీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర‌రావు తొలి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. ఆ త‌ర్వాతే మెట్రో ప‌నుల్లో వేగం పెరిగింది. ఒకానొక ద‌శ‌లో కేసీఆర్ స‌ర్కారు చెప్పిన‌ట్లుగా ఈ ప‌నుల‌ను తాను చేయ‌లేన‌ని మెట్రో ప్రాజెక్టు కాంట్రాక్ట‌ర్‌ గా ఉన్న ఎల్ అండ్ టీ కంపెనీ యాజ‌మాన్యం ఒకానొక ద‌శ‌లో చేతులెత్తేసింది. అయితే తెర వెనుక ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ... మళ్లీ ఎల్ అండ్ టీనే దారిలోకొచ్చేసి కొత్త ప్ర‌భుత్వం చెబుతున్న మాదిరే ప‌నులు చేసేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించేశారు. అంత‌కుముందు కంటే ఈ ప‌నులు కాస్తంత వేగంగానే జ‌రుగుతున్నా... హైద‌రాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా చాలా ఏళ్లే ప‌డుతుందన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

అయితే ప‌నులు మొత్తం పూర్త‌య్యేదాకా ఆగేది లేద‌న్న‌ట్లుగా ఓ భాగాన్ని ఓ రెండు మార్గాల్లో స‌ర్వీసుల‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు పూర్తి చేసిన కేసీఆర్ స‌ర్కారు.. ఇటీవ‌లే ప్ర‌ధాని న‌రంద్ర మోదీ చేతుల మీదుగా స‌ద‌రు ప్రాజెక్టును ప్రారంభించేసింది. హైద‌రాబాదులో మెట్రో అనే స‌రికి జ‌నం కూడా బాగానే రియాక్ట్ అయ్యారు. మెట్రో ప్రారంభం కాగానే ఆ రైలును ఎక్కేందుకు చాలా మంది క్యూలు క‌ట్టారు. అయితే అధిక చార్జీలు - సిటిజ‌న్ చార్ట‌ర్ల కార‌ణంగా మెట్రో ప్ర‌యాణికుల‌ను ఆక‌ర్షించ‌డంలో విఫ‌ల‌మైంద‌న్న వార్త‌లు ఇప్పుడిప్పుడే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎదో మోట్రో వ‌చ్చింది... ఓ సారి చూద్దాం అన్న భావ‌న‌తోనే తొలి నాళ్ల‌లో జ‌నం మెట్రో స్టేష‌న్ల‌కు క్యూ క‌ట్టారు త‌ప్పించి.. దానిపైనే ఆధార‌ప‌డి ప్ర‌యాణాలు సాగిస్తున్న వారి సంఖ్య చాలా త‌క్కువేన‌ని చెప్పాలి. మొత్తంగా ప్రారంభించిన రోజుల వ్య‌వ‌ధిలోనే మోట్రో రైలు బోగీలు చాలా మేర‌కు ఖాళీగానే తిరుగుతున్నాయ‌ని ఇప్పుడు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఏళ్ల త‌ర‌బ‌డి ప‌నులు కొన‌సాగి... ఎలాగోలా 20 ఏళ్ల‌కు ఈ ప్రాజెక్టులో ఓ భాగం పూర్తి కాగా... ఇప్పుడు టీఆర్ ఎస్ యువ‌నేత‌ - తెలంగాణ ఐటీ - మునిసిప‌ల్ శాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌కరామారావు... నిన్న అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. హైద‌రాబాదు మెట్రో పూర్తి అయ్యింద‌ని, ఇప్పుడు కొత్త‌గా భాగ్య‌న‌గ‌రి వాసుల‌కు మోనో రైలును ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించేశారు. ప్ర‌క‌టించ‌డమే కాదండోయ్‌... ఏకంగా మోనో రైలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాల‌ని ఆయ‌న ఏకంగా ఓ క‌మిటీనే నిన్న నియ‌మించారు. ఏళ్ల త‌ర‌బ‌డి కొన‌సాగిన మెట్రో రైలే ఇప్ప‌టికీ పూర్తి కాకుంటే... ఇప్పుడు కొత్త‌గా ఈ మోనో ఏంట్రా దేవుడా అని ప్రజ‌లు అప్పుడే నోస‌లు చిట్లిస్తున్నారట‌. అయినా ఇదేమైనా చిన్న విష‌యమా? కేటీఆర్ అంత‌గా స్పీడు పెంచ‌డానికి అన్న సెటైర్లు కూడా అప్పుడే వినిపిస్తున్నాయి.