Begin typing your search above and press return to search.

కేటీఆర్ ప్ర‌క‌ట‌న: నా మెజార్టీ 75వేలు

By:  Tupaki Desk   |   9 Dec 2018 5:20 PM GMT
కేటీఆర్ ప్ర‌క‌ట‌న:  నా మెజార్టీ 75వేలు
X
నిశ్శబ్ద విప్లవంలో ఏకపక్ష తీర్పు రాబోతోందని వంద సీట్లతో టీఆర్‌ ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతున్నదని రాష్ట్ర ఐటీ - పరిశ్రమల శాఖ అప‌ద్ధ‌ర్మ‌ మంత్రి కే తారక రామారావు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలంతా టీఆర్‌ ఎస్‌ వైపే ఉన్నారని ఆయ‌న‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ లో వచ్చినదానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పారు. కూటమి గారడీలను - మాయాజాలాన్ని తెలుసుకొని ప్రజలందరూ చైతన్యాన్ని కనబర్చారన్నారు. ఓటింగ్ సరళి అనుకున్న దానికంటే ఎక్కువగా తమ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ఓటింగ్‌ లో పెద్దఎత్తున పాల్గొన్నవారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్లు చైతన్యాన్ని - విజ్ఞతను ప్రదర్శించారన్నారు. గతంలో కంటే ఓటింగ్ శాతం పెరుగడంతో అభివృద్ధికి మద్దతిచ్చినట్టయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ - అభివృద్ధి కార్యక్రమాల వల్లే మహిళలు - వృద్ధులు - రైతులు పెద్ద ఎత్తున ఓటింగ్‌ లో పాల్గొన్నారని - పోలింగ్ శాతాన్ని పెంచారని అన్నారు. ప్రజల తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదని - ప్రజల హృదయాల్లో కేసీఆర్ గూడుకట్టుకొని ఉన్నారని చెప్పారు. జాతీయ - రాష్ట్ర న్యూస్ చానళ్లు - మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ లో చాలా వరకు టీఆర్‌ ఎస్ అధికారంలోకి వస్తుందని తేలిందన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి కార్యకర్త, నాయకుడు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ కోరారు.

కూటమిది అపవిత్ర - అవకాశవాద పొత్తుకు పరాకాష్టగా ప్రజలు భావించారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. చంద్రబాబుతో కూటమికి భారీగా నష్టం జరిగిందని, అందుకే చివరి రెండ్రోజులు ఆయన ఫోటో లేకుండా ప్రకటనలు ఇచ్చారని పేర్కొన్నారు. పత్రికా ప్రకటనల పేరుతో కూటమి నేతలు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ లో సీఎం కావాలని కలలు కన్నవారు - ప్రచారం చేసుకున్న నాయకులందరు కనీసం పక్క నియోజకవర్గంలో ప్రచారం చేయలేదన్న కేటీఆర్.. వారిలో అత్యధికులు ఓడిపోబోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ లోని స్టార్ క్యాంపెయినర్లు కూడా రాహుల్‌ ను తెచ్చుకుని తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోతున్నామని తెలిసిపోవడంతో కూటమి నాయకులు కుంటి సాకులు వెతుకుతున్నారని, దానిలో భాగంగానే ఈవీఎంలపై అపోహలు - అనుమానాలు కలిగించే విధంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కుంటిసాకులు వెతకడమంటే అన్యాపదేశంగా ఓటమిని అంగీకరించడమేనని అన్నారు. సిరిసిల్లలో తాను 75వేల మెజార్టీతో గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఈవీఎంలపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ ఆయన తెలివితేటల గురించి దేశం మొత్తం తెలుసునని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు మాత్రం ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉందని అన్నారు. ఈవీఎంల విధానంలోనే కాంగ్రెస్ రెండుసార్లు గెలిచింది...మరి ఆ విషయంలో ఏమంటారు? అని ప్రశ్నించారు. బీజేపీకి వంద సీట్లలో డిపాజిట్లు రావని అనేక మార్లు చెప్పామని, ఇప్పుడు అదే నిజం కాబోతున్నదని వ్యాఖ్యానించారు. ఫెడరల్‌ ఫ్రంట్ - ఇతర విషయాలపై ఈ నెల 11న తరువాత మరింత స్పష్టత ఇస్తామని చెప్పారు. చాలామంది ఓట్లు గల్లంతయ్యాయన్న కేటీఆర్.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి వాటిని సరిదిద్దాలని ఎన్నికల సంఘాన్ని పార్టీపరంగా కోరుతామని తెలిపారు.