Begin typing your search above and press return to search.

2019..తెలుగుదేశం అవుట్ :కేటీఆర్

By:  Tupaki Desk   |   16 Dec 2018 9:34 AM GMT
2019..తెలుగుదేశం అవుట్ :కేటీఆర్
X
తెలుగుదేశం. రెండు తెలుగు రాష్ట్రాల్లోను - విదేశాల్లోనూ కూడా వెలుగొందిన పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ. అంతే కాదు దేశంలోకెల్లా అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడని చెప్పుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న పార్టీ. ఇదంతా గతమంటున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు. 2019 ఎన్నికల తర్వాత తెలంగాణలోను - అటు ఆంధ్రప్రదేశ్ లోనూ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అంటున్నారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా జాతీయ స్ధాయిలో కీలక పాత్ర కూడా పోషిస్తుందని కల్వకుంట్ల తారక రామారావు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి కార్యనిర్వాహక అధ్యక్షుడైన తర్వాత తారక రామారావు మీట్ ది ప్రెస్ లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. జాతీయ స్ధాయిలో తెలుగుదేశం పార్టీ కీలక భూమి పోషిస్తుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, అది జరగని పని అని చెప్పారు. " జాతీయ రాజకీయాలు - పునరేకికరణ వంటివి తర్వాత. ముందు తెలుగుదేశం పార్టీని రక్షించుకోండి" అని తారక రామారావు హితవు పలికారు.

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్పదేశ్ లో తెలంగాణ రాష్ట్ర సమితి చాలా కీలకమైన భూమిక పోషించబోతోందని - అది ఏ రూపంలో ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా శక్తివంతమైన రాజకీయ పార్టీకి తాము అండగా ఉంటామని మాత్రం చెప్పారు. "ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి ఏది మంచిదో నిర్ణయించు కోగలరు. అయితే మేం కూడా ఏది మంచిదో వారికి సూచిస్తాం" అని తారక రామారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తాము వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని - వారు ఇక్కడ పోటీ చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ జాతీయ స్ధాయిలో బీజేపీ - కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అన్నారు. ప్రస్తున్న పరిణామాలను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 150 స్దానాలు కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదని - కాంగ్రెస్ పార్టీ తనకు 2014లో వచ్చిన 44 స్ధానాలకు రెట్టింపుగా అంటే 88 స్ధానాల్లోనే విజయం సాధించే అవకాశం ఉందన్నారు. "చివరికి రెండు పార్టీలు కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు" అని కేటీఆర్ చమత్కరించారు.