Begin typing your search above and press return to search.

కేటీఆర్‌... కెరీర్ బిగ్ స్టెప్స్ !

By:  Tupaki Desk   |   15 Dec 2018 8:38 AM GMT
కేటీఆర్‌... కెరీర్ బిగ్ స్టెప్స్ !
X
టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా బాధ్యతలు చేపట్టిన కేటీ రామారావు ఇకనుంచి పార్టీలో - ప్రభుత్వంలో కీలకం కానున్నారు. లోక్‌ సభ ఎన్నికలకు ముందే కేటీఆర్‌ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు తెరాస అధినేత కేసీఆర్‌ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత పార్టీ పగ్గాలను తనయుడికి అప్పగించి ఆ తర్వాత ప్రభుత్వ పీఠాన్ని కూడా కేటీఆర్‌ కు అప్పగించేందుకు సర్వం సన్నద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే కేటీఆర్‌ కు పార్టీలో కీలక పదవి కట్టబెట్టారని అంటున్నారు.

త్వరలో కొలువుదీరే మంత్రివర్గ సభ్యుల ఎంపికలోనూ కేటీఆర్‌ కీలకంగా వ్యవహరిస్తారన్న ప్రచారం లేకపోలేదు. ఎలాగూ ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనుడు కానున్న కేటీఆర్‌ తన అనుయాయులనే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న సూచన - ప్రతిపాదన అధినేత కేసీఆర్‌ కు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీన్నిబట్టి చూస్తుంటే మంత్రివర్గంలోనూ యువరక్తం ఎక్కించేందు కు కేటీఆర్‌ ప్రణాళికలు రూపొందిస్తారని తెలుస్తోంది.

రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే కేటీఆర్‌ పార్టీలో - బయట అందరి మన్ననలు పొందడంతో పాటు ప్రతి కార్యకర్తకు చేరువయ్యారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తండ్రి తర్వాత కేటీఆరే ఎక్కువ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి ప్రచారాన్ని నిర్వహించా రు. సీఎం తనయుడు అయినప్పటికీ ఆయన పార్టీలో సామాన్య కార్యకర్తగానే వ్యవహరిస్తూ వచ్చారు. కేటీఆర్‌ హయాంలో పార్టీ మరింత పురోగతి సాధిస్తుందన్న నమ్మకంతో పార్టీశ్రేణులు ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ అధ్యక్షుడు - కార్యనిర్వాహక అధ్యక్షుడే కీలకంగా వ్యవహరిస్తారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కేసీఆర్‌ రాష్ట్రంలో పార్టీ వ్యవహరాలను చక్కదిద్దుతూ జాతీయ స్థాయిలో తాను పెట్టాలనుకున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ ను బలోపేతం చేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టే కేటీఆర్‌ ఇటు ప్రభుత్వాన్ని - అటు పార్టీని జోడు గుర్రాలుగా ముందుకు తీసుకువెళ్ళేందుకు సాయశక్తులా ప్రయత్నించవలసి ఉంటుంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించిన కేటీఆర్‌ నాలుగున్నర సంవత్సరాలపాటు పంచాయితీరాజ్‌ - భారీ పరిశ్రమలు - ఐటీ శాఖ మంత్రిగా ఎంతో పరిణతి సాధించారు. కేటీఆర్‌ తన హయాంలో చేపట్టిన ఐటీ ప్రాజెక్టులు - తీసుకువచ్చిన నూతన పరిశ్రమలతో ఆయన ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పరిశ్రమల అనుమతికి ఏకగవాక్ష విధానం అమలు చేయడంతో పాటు దరఖాస్తు చేసిన పదిహేను రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడం బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండదని పరిశ్రమలు నెలకొల్పిన పారిశ్రామికవేత్తలే ప్రకటించడం గమనార్హం. ఈ నాలుగున్నరేళ్ళలో ప్రభుత్వ నిర్వహణపై పూర్తిస్థాయి పట్టు సాధించిన కేటీఆర్‌ రానున్న కాలంలోనూ ప్రజలకు అత్యుత్తమ పాలన అందిస్తారన్న నమ్మకంతోనే తొలుత ఆయనకు తండ్రి కేసీఆర్‌ పార్టీ పగ్గాలను అప్పగించారని ఆ తర్వాత ప్రభుత్వంలోనూ ఆయన కీలకంగా ఉంటారని రాజకీయ పండితులు చెబుతున్నారు.

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడంతో ఆంగ్ల భాషలో కేటీఆర్‌ మంచి పట్టు సాధించారు. దేశ - విదేశీ ప్రతినిధులను ఆశ్చర్యంలో ముంచెత్తేలా వివిధ కార్యక్రమాల్లో కేటీఆర్‌ చేసిన ప్రసంగాలు వారిని ఎంతో ఆకట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటించినపుడు ఆమెతో జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి దేశ - విదేశీ ప్రతినిధుల మన్ననలను పొంది భేష్‌ అనిపించుకున్నారు. కేటీఆర్‌ మంత్రిగా చేసిన సేవలను గుర్తించి అనేక జాతీయ సంస్థలు ప్రభుత్వానికి - మంత్రికి అవార్డులు కూడా ప్రకటించింది. రాష్ట్రానికి భారీఎత్తున పెట్టుబడులను తెచ్చేందుకు ఆయన కొరియా - జపాన్‌ - ఇటలీ - న్యూజిలాండ్‌ తో పాటు అనేక దేశాల్లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన పారిశ్రామిక చట్టాన్ని వివరించి వారిని రాష్ట్రానికి రప్పించేలా చర్యలు తీసుకున్నారు. భారీ పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ళ వ్యవధిలోనే రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడంలో విజయవంతమయ్యారు.

హైదరాబాద్‌ ను విశ్వనగరంగా చేసేందుకు చర్యలు చేపట్టిన కేటీఆర్‌ ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభించగా - కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిచేశారు. నగరానికి తలమానికమైన మెట్రోరైల్‌ ప్రాజెక్టును శంషాబాద్‌ అంతర్జా తీయ విమానాశ్రయానికి పొడిగిం చేందుకు కేటీఆర్‌ సఫలీకృతుల య్యారు. హైదరాబాద్‌ లో మౌలిక సదుపాయాలను పెంచి ప్రతి ఒక్కరికీ అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. కాలుష్య కారకమైన పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌రోడ్డు బయటకు పంపించి పారిశ్రామికవేత్తలకు నగర శివార్లలోని పారిశ్రామికవాడల్లో స్థలాలను కేటాయించి అనుమతులను మంజూరు చేశారు. ఔటర్‌ రింగ్‌రోడ్డును పూర్తి చేయడంతో పాటు హైదరాబాద్‌ కు నలువైపులా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

ఐటీ పరిశ్రమలను విస్తృతంగా తీసుకురావడంతో పాటు వరంగల్‌ - నిజామాబాద్‌ - మహ బూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రాల్లో ఐటీ క్లబ్‌ లను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. వివిధ కారణాలతో మూసివేసిన సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ పేపరు మిల్లుతో పాటు ఖాయిలా పరిశ్రమలను తెరిపించేందుకు కేటీఆర్‌ చేసిన కృషి అంతా ఇంతా కాదనే చెప్పాలి. హైదరాబాద్‌ మహానగరంలో ఏ సమస్య వచ్చినా తానున్నాంటూ వాలిపోయే కేటీఆర్‌ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జీహెచ్‌ ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లి నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరేలా చేశారు. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో రోడ్‌ షోలను నిర్వహించడం - హమారా హైదరాబాద్‌ పేరు బస్తీ సభలను జరిపి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మునిసిపల్‌ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో హైదరాబాద్‌ నగరంలో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో 99 డివిజన్లను కైవసం చేసుకుని తన చతురతను ప్రదర్శించారు. ఎన్నికలకు ముందే వంద స్థానాలకుపైగా తెరాస విజయం సాధిస్తుందని ప్రకటించిన కేటీఆర్‌ అటు ఇటుగా అన్నే స్థానాలపై పార్టీ విజయకేతనం ఎగురవేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేసి పార్టీ అధికారంలోకి రావడంలో తానూ క్రియాశీల పాత్ర పోషించారు.