Begin typing your search above and press return to search.

3 ప్లాన్ల‌తో ముందుకెళ్తున్న కేటీఆర్‌

By:  Tupaki Desk   |   18 Dec 2018 5:04 AM GMT
3 ప్లాన్ల‌తో ముందుకెళ్తున్న కేటీఆర్‌
X
పాల‌న‌ పై మ‌రింత శ్ర‌ద్ధ పెట్ట‌డం - జాతీయ రాజ‌కీయాల్లో క్రియా శీల‌క పాత్ర పోషించ‌డం ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పార్టీ పై పూర్తి స్థాయిలో కేంద్రీ కరించేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా కే తారక రామారావును నియమించిన సంగ‌తి తెలిసిందే. పార్టీ ప‌గ్గాలను అట్ట‌ హాసంగా జ‌రిగిన కార్య‌ క్ర‌మంలో కేటీఆర్‌ స్వీక‌రించారు. అయితే, ఇప్పుడు ఆయ‌న ఏం చేయ‌బోతున్నారు? పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోనున్నారు? అనేది అన్నివ‌ర్గాల్లోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం. విశ్వ‌స నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మూడు ప్ర‌ణాళి క‌ల‌తో కేటీఆర్ ముందుకు సాగ‌నున్నారు. కొత్త తరాన్ని పార్టీ వైపు ఆకర్షించడం, పార్టీలో ఉన్న వారిని సుస్థిరం చేసుకోవడం, సీనియర్ల సేవలను సమర్థం గా వినియోగించుకోవడం.. ఇవి మూడురకాలైన‌ వ్యూహాలని స‌మాచారం.

పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణను రూపొందించారు. పార్టీని - కేసీఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరు పార్టీలో దీర్ఘకాలికంగా కొనసాగేలా వారితో నేరుగా సంబంధాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక నాయకత్వం కారణంగా ఏ ఒక్కరూ దూరం కావద్దనే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తుల కారణంగా పార్టీకి నష్టం జరుగవద్దని భావిస్తున్న కేటీఆర్.. దీనికోసం అన్నిరకాలుగా సమాచారం తెప్పించుకొని గ్రామస్థాయి నాయకుడిని కూడా కాపాడుకునేలా నెట్‌వర్క్ పెంపొందించాలని నిర్ణయించారు. ప్రభుత్వం మొదటిసారి అధికారంలో ఉన్న సందర్భంలో పలువురు ఎమ్మెల్యేలు పార్టీలోని కొందరిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఫిర్యాదులువచ్చాయి. అప్పుడున్న పరిస్థితుల్లో వాటిని చూసీచూడనట్టు వ్యవహరించక తప్పని పరిస్థితి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా, కష్టపడినా గుర్తింపు రానివారికి గుర్తింపునివ్వడం, నిర్లక్ష్యానికి గురైనవారిని ఆదరించడం ప్రాథమ్యాలుగా పెట్టుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్నారు. సభ్యత్వ నమోదు సమయంలోనే జెండాపండుగ కూడా నిర్వహిస్తారు. ఆ తరువాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు వేసుకోవడం, వారికి శిక్షణ ఇప్పించడం, కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించడం, కార్యకర్తల కష్టసుఖాల్లో భాగం పంచుకోవడం చేయనున్నారు. వీటన్నింటి ద్వారా భవిష్యత్‌లో టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చవచ్చని అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో ప్రతి జిల్లాకేంద్రంలో పార్టీ కార్యాలయాల ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే 30 జిల్లా కార్యాలయాలకు స్థలాలను ప్రభుత్వం నుంచి కొనుగోలుచేశారు. వీటన్నింటిని రాబోయే ఆరునెలల్లో నిర్మిస్తారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్.. జిల్లాలవారీగా పర్యటనలు చేపట్టి.. పోలింగ్‌కేంద్రం, గ్రామం, మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధంచేయనున్నారు.

ప్ర‌ధానంగా యువ‌త‌ పై కేటీఆర్ దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం. పార్టీని స్థాపించి 18 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా కొత్తతరాన్ని పార్టీవైపు ఆకర్షించాల్సిన అవసరం ఉంది. సీనియర్లకు, కొత్తతరానికి మధ్య సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఏ పార్టీ భవిష్యత్తు అయినా యువతపైనే ఆధారపడి ఉంటుంది. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే యువతరాన్ని పార్టీలో ప్రోత్సహించాల్సి ఉంటుంది. అప్పుడే పార్టీ నాలుగుకాలాలపాటు వర్థిల్లుతుంది. దీనిలో భాగంగానే కేటీఆర్ నియామకమని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. తొలితరం నుంచి యువతరంవైపు పార్టీని మళ్లించడంలో భాగంగా నాయకత్వం సమర్థంగా వ్యవహరించి, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడగలిగిందంటూ పార్టీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాయి. కేటీఆర్‌కు రాష్ట్రవ్యాప్తంగా యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. యూత్ ఐకాన్‌గా నిలిచారు. ఆయన ఎక్కడ పర్యటించినా యువత పెద్దఎత్తున హాజరవుతున్నది. ఆయనను కలవడానికి ఉత్సాహం చూపిస్తున్నది. కేటీఆర్‌కు ఉన్న ఈ క్రేజ్‌ను పార్టీవైపు యువతను ఆకర్షించేందుకు ఉపయోగించాలని కేసీఆర్ నిర్ణయించారు.