Begin typing your search above and press return to search.

కేటీఆర్ ప్లాన్ ప్లాఫయింది..

By:  Tupaki Desk   |   30 Aug 2016 4:50 AM GMT
కేటీఆర్ ప్లాన్ ప్లాఫయింది..
X
తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కు ఎంత ఇమేజి ఉందో ఆయన తనయుడు - మంత్రి కేటీఆర్ కు కూడా అంతే ఇమేజి ఉంది. ఆయన ఏ పని చేసినా అదరగొడతారని... ఆయన తలదూర్చితే అది విజయమే అవుతుందని చెబుతుంటారు. ఐటీ రంగంలో కానీ, హైదరాబాద్ ట్రాన్ఫర్మేషన్ కానీ.. ఇలా అనేక విషయాల్లో కేటీఆర్ సత్తాకు ఉదాహరణలు చెబుతున్నారు ఆయన అభిమానులు - టీఆరెస్ శ్రేణులు. నిజానికి... కేటీఆర్ పనితీరును చూసినా ఆయన ఏదో చేయాలని తపిస్తున్నారన్న విషయం అర్థమవుతోంది. కానీ.. కొన్ని విషయాల్లో ఆయనది కూడా ఆరంభం శూరత్వమేనా అన్న సందేభహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హైదరబాద్ అభివృద్ధికి సంబంధించి ఆ మధ్య కేటీఆర్ చెప్పిన 100 రోజుల ప్లాన్ దారుణంగా విఫలమైంది. అయన చెప్పినవాటిలో అమలైనవి అంతంతే.. దీంతో కేటీఆర్ పనితీరుపై విపక్షాలు విమర్శల బాణాలు సంధిస్తున్నాయి.

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ తరపున మెరుగైన సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని చెప్పిన మాటలు హుస్సేన్ సాగర్ లో కలిశాయి. నగరంలోని కోటి మంది జనాభాకు ఏడాది పొడువున అందించాల్సిన సేవలు - ఇతర అభివృద్ధి పనులను మెరుగ్గా అందిస్తామంటూ గత ఫిబ్రవరి 18న మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు వందరోజుల యాక్షన్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు. జిహెచ్‌ ఎంసి రొటీన్ గా చేపట్టాల్సిన పనులనే ఈ వందరోజుల యాక్షన్ ప్లాన్‌ లో పెట్టారు... కానీ, అవీ జరగలేదు. ఈ ప్లాన్ కింద నగరంలో 50 ఆధునిక బస్ బేలు - వంద మోడల్ మార్కెట్లు - 150 ఆధునిక జిమ్‌ లు - నీటి శుద్ధి కేంద్రాలు - ఆన్‌ లైన్‌ లో భవన నిర్మాణ అనుమతులు - ప్రత్యేక యాప్ - జిహెచ్‌ ఎంసికి చెందిన 350 ఖాళీ స్థలాలకు ప్రహరీగోడల నిర్మాణం వంటి పనులను చూపించారు. అవన్నీ 100 రోజుల్లో చేస్తామన్నారు. అందులో ఆన్‌ లైన్ అనుమతులు - ప్రత్యేక యాప్ - మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరీ మినహా మిగిలిన ప్రతిపాదనల్లో ఏ పనీ జరగలేదు.

అయితే.. ప్లాన్ మొదలుపెట్టిన పూర్తయిన తరువాత దీని ప్రకారం చేపట్టిన పనుల పురోగతికి సంబంధించి సమీక్షలను మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించనున్నట్లు హడావుడి చేసిన జిహెచ్‌ ఎంసి అధికారులు లక్షలాది రూపాయలను వెచ్చించి వందల సంఖ్యలో బుక్‌ లెట్లను ముద్రించారు. వాటి ఆవిష్కరణ కూడా పూర్తిచేయలేకపోయారు. జూన్ 2న బుక్‌ లెట్‌ ను ఆవిష్కరిస్తామని ప్రకటించారు కానీ.. ఆ సమయానికి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన అమెరికా నుంచి వచ్చారు కానీ బుక్ లెట్ల ఆవిష్కరణ చేయలేదు. ప్లాన్ ప్రకారం పనులు కాకపోవడంతోనే బుక్ లెట్ల ఆవిస్కరణ పక్కనపెట్టారని సమాచారం. 2వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఈ 100 రోజుల ప్లానులోనే చెప్పినా అదీ అమలు కాలేదు. మొత్తానికి కేటీఆర్ 100 రోజుల ప్లాన్ కాస్త ప్లాఫ్ అయినట్లుగా కనిపిస్తోంది.