Begin typing your search above and press return to search.

‘ఆ ఒక్కడు’ కూడా కారు ఎక్కేస్తున్నాడట

By:  Tupaki Desk   |   9 Feb 2016 6:10 AM GMT
‘ఆ ఒక్కడు’ కూడా కారు ఎక్కేస్తున్నాడట
X
గ్రేటర్ ఎన్నికల్లో తమ ప్రతాపాన్ని ప్రదర్శించుకోవాలని ఎన్నో కలలు గన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు గ్రేటర్ ప్రజలు భారీ షాక్ ఇవ్వటం తెలిసిందే. పాతిక తక్కువ కాకుండా కార్పొరేటర్లను గెలుచుకోవటం ఖాయమని భావించినప్పటికీ.. అందుకు భిన్నంగా ఒక్క డివిజన్ లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించటం తెలిసిందే. కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కేపీహెచ్ బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించిన శ్రీనివాసరావు తాజాగా టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రెఢీ అయిపోయారు.

మంగళవారం ఉదయం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ఎదురుచూడటం టీటీడీపీ వర్గాలకు షాకింగ్ గా మారాయి. ఓ పక్క నగరానికి చెందిన ఎమ్మెల్యే వివేక్ టీఆర్ ఎస్ లో చేరిపోగా.. అదే బాటలో మరో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశ్ గౌడ్ కారు ఎక్కటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. సందట్లో సడేమియాలా కేపీహెచ్ బీ కార్పొరేటర్ కూడా అధికారపక్షంలో చేరిపోవటం ఇప్పుడు షాకింగ్ కానుంది. దీంతో.. గ్రేటర్ పరిధిలో టీడీపీకి ఉన్న ఒకేఒక్కడూ జారిపోయిన పరిస్థితి. ప్రమాణస్వీకారం చేయకుండానే పార్టీ మారిన శ్రీనివాసరావు తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.