Begin typing your search above and press return to search.

కేఈ గారూ... ఈ వాయిదా మాటేంది?

By:  Tupaki Desk   |   13 Aug 2017 10:35 AM GMT
కేఈ గారూ... ఈ వాయిదా మాటేంది?
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23న జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక వాయిదా ప‌డుతుందా? అనే మాట వినిపిస్తేనే... అటు అధికార టీడీపీతో పాటు ఇటు విప‌క్ష వైసీపీకి గుండె గుభేమ‌న‌డం ఖాయ‌మే. ఎందుకంటే... ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందేన‌ని, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఈ ఎన్నిక విజ‌యంతోనే ముంద‌డుగు వేయాల‌ని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా... కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్దేశించిన ప్ర‌కారం ఇప్పుడు ఎన్నిక‌ల క్ర‌తువు సాగుతోంది. ఈ ఎన్నిక‌ను ఇప్ప‌టికిప్పుడు వాయిదా వేసేస్తే... రెండు పార్టీల‌కూ న‌ష్ట‌మేన‌న్న భావ‌న లేక‌పోలేదు. ప్ర‌త్యేకించి టీడీపీ భారీగా న‌ష్ట‌పోయే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న విష‌యాన్ని ఏ ఒక్క‌రూ కాద‌న‌లేనిదే. అధికారాన్ని దుర్వినియోగం చేసి విచ్చ‌ల‌విడిగా డ‌బ్బుల క‌ట్ట‌లు పంచేసే అధికార పార్టీల కార‌ణంగానే ఏ ఎన్నిక అయినా వాయిదా ప‌డిపోతుంది.

ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం... చెన్నైలోని ఆర్కేన‌గ‌ర్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌. జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం ఖాళీ అయిన ఆర్కే న‌గ‌ర్ కు ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల కాగా... అక్క‌డ విజ‌యం సాధించాల్సిందేన‌ని అక్క‌డి అన్నాడీఎంకే కోట్లాది రూపాయ‌ల‌ను కుమ్మ‌రించింది. అయితే స‌రైన క‌స‌ర‌త్తు లేకుండా చేసిన ఈ డ‌బ్బుల పంపిణీ ఎట్ట‌కేల‌కు ఎన్నిక‌ల సంఘానికి తెలిసిపోగా... ఆ ఎన్నిక‌ను వాయిదా వేసిన ఈసీ... అన్నాడీఎంకేకు షాకిచ్చింది. అక్క‌డ ఇంకెప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న విష‌యంపై ఇప్పుడు నోరెత్తి ప్ర‌శ్నించే నాథుడే లేకుండా పోయాడు. ఈ క్ర‌మంలో నంద్యాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఎన్నిక వాయిదా మాట అప్పుడ‌ప్పుడు వినిపిస్తోంది. ఇక్క‌డ విచిత్రంగా విప‌క్షం నుంచి వినాల్సిన ఆ మాట‌... అందుకు విరుద్ధంగా అధికార ప‌క్షం నుంచి వినిపిస్తోంది.

నిన్న నంద్యాల‌లో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ... ఉప ఎన్నిక‌ల‌ను వాయిదా వేయించే దిశ‌గా జ‌గ‌న్ వ్యవ‌హ‌రిస్తున్నార‌ని త‌న‌దైన శైలిలో ధ్వ‌జ‌మెత్తారు. అయినా ఉప ఎన్నిక‌ను వాయిదా వేయించాల్సిన అవ‌స‌ర‌మైతే ఇప్పుడు జ‌గ‌న్‌ కు లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... గ‌డ‌చిన నాలుగు ఎన్నిక‌ల్లో అక్క‌డ వైఎస్ కుటుంబం నిల‌బెట్టిన అభ్య‌ర్థులే విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు కూడా అక్క‌డ వైసీపీ విజ‌యం సాధిస్తుంద‌న్న కోణంలో ప‌లు స‌ర్వేలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో నంద్యాల బైపోల్స్‌ను వాయిదా వేయించే దిశ‌గా జ‌గ‌న్ ఎలాంటి య‌త్నం చేయ‌బోర‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే గియితే... అధికార పార్టీగా ఉండి ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైతే... రేప‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏ ముఖం పెట్టుకుని వెళ‌దామన్న కోణంలో ఆలోచిస్తే టీడీపీనే ఉప ఎన్నిక‌ను వాయిదా వేయించే దిశ‌గా కుట్ర‌లు చేసే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.