వార్నింగ్ ఇచ్చేందుకే అభ్యర్థులతో కేసీఆర్ భేటీ?

Sat Oct 20 2018 12:30:00 GMT+0530 (IST)

టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన పార్టీ నేతలపై అసంతృప్తితో ఉన్నారా?  సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరుసటిరోజు హుస్నాబాద్ సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించినప్పటికీ...ప్రచార పర్వం - నాయకుల తీరుపై నారాజ్ లో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీఆర్ ఎస్ అభ్యర్థులకు అవగాహన సదస్సును ఈ నెల 21న నిర్వహించాలని పార్టీ నిర్ణయించడం - దీనికి ఎమ్మెల్యే అభ్యర్థులంతా `తప్పనిసరిగా` హాజరుకావాలని ఆదేశించడం వెనుక కారణం...అసంతృప్తేనని - అవసరమైతే వారిని మార్చే అవకాశం ఉందని అంటున్నారు.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో గులాబీ దళపతి కేసీఆర్  పాల్గొని అభ్యర్థులతో స్వయంగా మాట్లాడుతారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం - ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అభ్యర్థులకు ఈ సమావేశంలో అవగాహన కల్పిస్తారు. పార్టీ ప్రకటించిన 105 మంది అభ్యర్థులు ఈ సమావేశంలో విధిగా పాల్గొనాలని పార్టీ ఆదేశించింది. పార్టీ ఎంపీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. పాక్షిక మ్యానిఫెస్టో ప్రకటనతో మరోసారి ఉధృత స్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ..మరో ప్రచారం కూడా తెరమీదకు వస్తోంది. అదే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పట్ల - వారి ప్రచారం తీరు పట్ల కేసీఆర్ అసంతృప్తితో ఉండటం. ఇప్పటికే తను చేయించిన సర్వేల్లో 40 మంది అభ్యర్థుల ప్రచారం తీరు - జనాలతో కలుస్తున్న విధానం అస్సలు బాగాలేదని తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారికి 20 రోజుల సమయం ఇవ్వనున్న తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆదేశించనున్నట్లు తెలుస్తోంది.

20 రోజుల గడువు అనంతరం తమ పనితీరు మార్చుకోని అభ్యర్థుల విషయంలో కేసీఆర్ కఠినంగా వ్యవహరించవచ్చంటున్నారు. అవసరమైతే వారి బదులుగా మరో అభ్యర్థిని బరిలో దింపేందుకు కూడా వెనుకాడబోరని చెప్తున్నారు. ఎందుకంటే 40 మంది అభ్యర్థుల గెలుపు విషయంలో కేసీఆర్ `రిస్క్` చేయదలుచుకోలేదని - అందుకే వారిని మార్చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. కాగా ఈ సమావేశం సందర్భంగా తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను సైతం ఆయన వెల్లడించనున్నట్లు చెప్తున్నారు.