Begin typing your search above and press return to search.

కేసీఆర్ టార్గెట్: రైతులు ఉద్యోగులు

By:  Tupaki Desk   |   11 Jan 2018 10:03 AM GMT
కేసీఆర్ టార్గెట్: రైతులు ఉద్యోగులు
X

తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి ఉన్నట్లుగా రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్న దానికి మ‌రిన్ని ప‌రిణామాలు తోడ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల గురించి క‌స‌ర‌త్తు చేస్తున్నార‌నే అంచ‌నాల నేప‌థ్యంలో...తాజాగా రైతు పెట్టుబ‌డి గురించి చేస్తున్న క‌స‌ర‌త్తు - ఉద్యోగుల పెన్ష‌న్ విష‌యంలో వేస్తున్న ఎత్తుగ‌డ‌లు ఈ ఆలోచ‌న‌ల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి.

టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ స‌న్నిహిత‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ...రైతులు - నిరుద్యోగుల‌ను కేసీఆర్ టార్గెట్ చేసుకున్నారు. అయితే రుణ‌మాఫీ అమ‌లు వంటి వైఫ‌ల్యాలు త‌లెత్త‌వ‌ద్ద‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం. టీఆర్ ఎస్ అధినేత అధికారంలోకి వ‌చ్చాక రుణ‌మాఫీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. నాటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఇది అస్తవ్యస్థ ధోరణులకు దారి తీస్తుందని అన్న‌ప్ప‌టికీ..త‌మ‌ది మిగులు రాష్ట్రమ‌ని పేర్కొంటూ హామీ ఇచ్చేశారు. అయితే...నాలుగు విడ‌త‌లుగా రైతు రుణమాఫీ అమ‌లు చేయ‌డంతో కేవ‌లం వ‌డ్డీ మాఫీగా మారింద‌నే భావ‌న ఉంది. దీంతో దాదాపు 36 లక్ష‌ల మంది రైతులు ఇక్క‌ట్లు ప‌డ్డారు. రైతుకు వ్య‌వ‌సాయ రుణం అంద‌క ప్రైవేట్ వ‌డ్డీ వ్యాపారుల వ‌ద్ద పెట్టుబ‌డుల కోసం అప్పులు చేశారు. పంట రుణమాఫీ విషయంలో బ్యాంకుల తీరుతో రైతులకు పూర్తి ప్రయోజనం కలుగలేదనే భావన ఉంది. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుచేసినా.. విపక్షాల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందనే అభిప్రాయం ఉంది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం అల‌ర్ట్ అయింది. రాబోయే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌స్తే రూ. రెండు ల‌క్ష‌ల రుణ‌మాపీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని స‌మాచారం. అందుకే రైతుల నుంచి రాబోయే కాలంలో అయినా..వ్య‌తిరేక‌త రాకుండా చూసుకునేందుకు పెట్టుబ‌డిని మార్గంగా ఎంచుకుంది. అందుకే చెక్కుల రూపంలో రైతు పెట్టుబ‌డి అందించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.ఇదే విషయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌తో చ‌ర్చించారు. అంతేకాకుండా క్షేత్ర‌స్థాయి అధ్య‌య‌నం చేయించారు.

రైతులకు సాగుకు పెట్టుబడిని చెక్కుల రూపంలో అందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ ఏడాది వానకాలం సీజన్ నుంచి రైతులకు ఇద్దామనుకున్న సహకారాన్ని ఏ రూపంలో అందిస్తే ఎక్కువ ప్రయోజనకరం అనే అంశంపై క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు - ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా 551 మండలాల్లోని 624 గ్రామాల్లో 62,677 మంది రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు - వ్యవసాయాధికారులు రైతుల వద్ద నుంచి సేకరించిన అభిప్రాయంపై బుధవారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం చర్చించింది. అభిప్రాయ సేకరణ సందర్భంగా ఎక్కువమంది రైతులు పంట పెట్టుబడిని చెక్కుల రూపంలోనే ఇవ్వాలని కోరారు. దాంతో చెక్కుల రూపంలోనే సాయం అందించాలన్న తుది నిర్ణయానికి మంత్రివర్గ ఉపసంఘం వచ్చింది. రైతు స‌మ‌న్వ‌య‌స‌మితిల స‌హకారంతో....బ్యాంకు సౌకర్యం లేని సమస్యాత్మక ప్రాంతాల్లోని రైతులకు నగదు రూపంలో పెట్టుబడి సాయం అందిస్తే బాగుంటుంద‌ని ఈ ఉప‌ సంఘంలోని కొందరు మంత్రులు ప్రస్తావించారు. ఇటువంటిచోట్ల పెద్దమొత్తంలో నగదు అధికారుల వద్ద ఉంటే భద్రతాపర ఇబ్బందులు తలెత్తుతాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇలాంటి ప్రాంతాల్లోని రైతులకు పోస్టాఫీసులలో ఖాతాలు తెరిపించి - చెక్కులను మార్చుకునే అవకాశం కల్పించడం శ్రేయస్కరమని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇదిలాఉండ‌గా...రాబోయే ఎన్నిక‌ల కోసం టీఆర్‌ ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో రైతుల వ్యవసాయ రుణం రూ.2 లక్షల వరకు మాఫీ అనే అంశాన్ని పొందుపర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదిలాఉండ‌గా...ఉద్యోగుల విష‌యంలో రెండు ర‌కాల ఆలోచ‌న‌ల‌తో స‌ర్కారు ముందుకు సాగుతోంది.తెలంగాణలో కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీంపై పరిధిలోకి వచ్చే దాదాపు 1.25 లక్షల మంది ఉద్యోగులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కూడా సీపీఎస్‌ విధానాన్ని తప్పుపడుతోంది. పెద్ద సంఖ్యలో ఉన్న ఉద్యోగుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రంలో సీపీఎస్‌ రద్దుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయాలని కేంద్రానికి సిఫారసు చేయాలని టీఆర్ ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీపీఎస్ కింద కేవలం రూ.2000 పెన్షన్ మాత్రమే వస్తుండటంతో అన్ని వర్గాల నుంచి ఆందోళనలు - అభ్యర్థనల రూపంలో వెళ్లిన ప్రతిపాదనల నేపథ్యంలో కేంద్రం కూడా పునరాలోచించినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా కనీస పెన్షన్ రూ.8000 - గరిష్ఠంగా రూ.20వేలకు పెంచాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

జూలై 1 - 2018 నుంచి అమల్లోకి రావాల్సిన 11వ పీఆర్‌ సీ విష‌యంలో ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌ ను కలిసి పే రివిజన్‌ కమిషనర్‌ ను నియమించాలని అభ్యర్థించారు. పీఆర్‌సీ కమిషనర్‌ నియామకంతోపాటు, గడువు కంటే ముందే నివేదిక తెప్పించుకోవాలని, జూలై 1 - 2018 నుంచి 11వ పీఆర్‌ సీ అమల్లోకి వచ్చే విధంగా చూడాలని కోరారు. రాబోయే ఎన్నికల ముందు ఇదే చివరి పీఆర్‌సీ కావటంతో ఉద్యోగులకు ఫిట్‌ మెంట్‌ - ఐఆర్‌ విషయంలో కొంత ఉదారంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ విష‌యంలో ఉద్యోగుల‌ను ఖుస్ చేసేలా కేసీఆర్ ప్ర‌ణాళిక‌లు ఉంటాయంటున్నారు.