Begin typing your search above and press return to search.

కేసీఆర్ క్యాబినెట్ మ‌ళ్లీ మారుతోంది

By:  Tupaki Desk   |   30 July 2016 9:11 AM GMT
కేసీఆర్ క్యాబినెట్ మ‌ళ్లీ మారుతోంది
X
తెలంగాణ‌ ముఖ్య మంత్రి కేసీఆర్ త‌న క్యాబినెట్‌ పునర్ వ్యవస్థీకరణకు శ్రీ‌కారం చుట్ట‌నున్నార‌ని మ‌రోమారు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల పనితీరును కేసీఆర్‌ అంచనా వేయ‌గా కొంద‌రు అవినీతి ఆరోప‌ణ‌ల్లో చిక్కుకోవ‌డం - మ‌రికొంద‌రు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్ర‌వ‌ర్తించ‌డం - ప‌లువురి ప‌నితీరు అస‌లే మాత్రం బాగాలేద‌ని తేలిన‌ట్లు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో దసరా పండుగకు మంత్రివర్గంలో మార్పులుంటాయ‌ని స‌మాచారం.

ఆరోపణలు ఉన్న మంత్రులను - స‌రిగా ప‌రిపాలించ‌లేని అమాత్యుల‌ను పక్కనపెట్టి ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తేనే ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం ఏర్పడుతుందన్న భావన కేసీఆర్‌ లో బలంగా ఉంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ప్రస్తుతం ఉన్న కొందరిని తొలగించి - కొత్తవారిని చేర్చుకోబోతున్నట్టు చెప్తున్నారు. ఆరుగురు మంత్రుల‌పై వేటు ఖాయమని టీఆర్‌ ఎస్‌ పార్టీ వర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. మంత్రి పదవిని ఆశించి టీఆర్‌ ఎస్‌ లో చేరిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకరరావు - స్వామిగౌడ్‌ - నిరంజన్‌ రెడ్డి - కొప్పుల ఈశ్వర్‌ - కొండా సురేఖను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. పక్కనపెట్టేవారిలో వరంగల్‌ - మహబూబ్‌ నగర్‌ - నిజామాబాద్‌ - హైదరాబాద్‌ - ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన మంత్రుల పేర్లు వినపడుతున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఈ అంశాల‌పై క్లారిటీ రానుంద‌ని స‌మాచారం.