పోలీసుల మనసుల్ని దోచేసిన కేసీఆర్

Fri May 19 2017 15:40:25 GMT+0530 (IST)

అసలే కేసీఆర్. ఆపై ఆయన పొగడటం మొదలు పెట్టినా.. వరాల వర్షం కురిపించినా.. ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఆయన ఎస్ ఐ నుంచి డీజీపీ స్థాయి అధికారులతో కలిసి సుమారు 1500 మంది పోలీసులతో భారీ సమావేశాన్ని నిర్వహించటం ఒక ఎత్తు అయితే.. ఆ సమావేశం సందర్భంగా కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల్ని తెలంగాణ పోలీసులు ఒక పట్టాన మర్చిపోరనే చెప్పాలి.

మాదాపూర్ లోని హెచ్ ఐసీసీలో ఏర్పాటు చేసిన తాజా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణరాష్ట్ర సాధనలో పోలీసులు సహకారం ఎంతో ఉందన్న ఆయన.. రాష్ట్ర ఏర్పాటులో పరోక్షంగా సాయం చేశారన్న మాటను చెప్పటం విశేషం. తెలంగాణ వస్తే మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ అవుతుందన్న అనుమానాల్ని..  సందేహాల్ని తెలంగాణ పోలీసులు తొలగించేశారన్నారు.  ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ రాష్ట్ర పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం కురుస్తుందన్న ఆయన.. పోలీసులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.

పోలీసుల సమస్యల్ని ప్రస్తావించటమే కాదు.. వాటి పరిష్కారం కోసం తాను ప్రయత్నించనున్నట్లు వెల్లడించారు. పోలీసుశాఖకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్న మాటతోనే సరిపెట్టకుండా.. పోలీసులకు అధునాత వాహనాల కోసం రూ.500 కోట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు శాఖకు 4వేల  కొత్త వాహనాల్ని కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్.. కొత్తగా రానున్న వాహనాలతో పోలీసుల పనితీరు మరింత మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పోలీసులపై ప్రజల్లో విశ్వాసం కల్పించేలా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చినట్లుగా చెప్పిన కేసీఆర్.. తన సింగపూర్ పర్యటన గురించి ప్రస్తావించారు. సింగపూర్ కు తాను వెళ్లినప్పుడు.. అక్కడి మహిళలు అర్థరాత్రి వేళ రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదని.. అలాంటి దుస్థితి హైదరాబాద్ లో ఉండకూడదన్న ఉద్దేశంతోనే షి టీమ్ లను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు.

పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత వారిని సగౌరవంగా సాగనంపాలని.. వారిని ప్రత్యేకంగా వాహనంలో ఇంటి వద్ద దింపి రావాలంటూ చెప్పిన మాటలు పోలీసుల మనసుల్లో కేసీఆర్ మీద అభిమానాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లిపోయాయని చెప్పాలి. వ్యవస్థలో పోలీసులు ఎంతో కీలకమని.. లంచం తీసుకోకుండా పోలీసులు సేవలు అందించాలన్న సూచన చేశారు. పోలీసుశాఖలో ప్రమోషన్లపై కసరత్తు జరగాలన్న విషయాన్ని అంగీకరించిన కేసీఆర్.. ఆ దిశగా తమ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.

రిటైర్ అయిన పోలీసులు పెన్షన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి రాకూడదన్న ఆయన పోలీసులకు మరో తీపికబురును చెప్పారు. రాయదుర్గం భూముల అమ్మకంతో వచ్చిన డబ్బును పోలీస్ శాఖకే ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో పోలీసులకు లేని ఎన్నో సౌకర్యాల్ని తమ ప్రభుత్వం కల్పించిందని కేసీఆర్ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/