సోదరి మరణం!... కేసీఆర్ కంట కన్నీరు!

Wed Feb 21 2018 18:55:40 GMT+0530 (IST)

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగానే కాకుండా తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు... ఉద్యమ నేతగానే కాకుండా తనదైన ఎత్తులు వేసే రాజకీయ వేత్తగానే మనకు తెలుసు. విధాన నిర్ణయాల్లో చాలా కఠినంగా వ్యవహరించే కేసీఆర్... వైరివర్గాలను ఎదుర్కొనే విషయంలోనూ చాలా కఠినంగా వ్యవహరిస్తారు. తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ల పాటు బతికించుకుంటూ వచ్చిన కేసీఆర్.. ఎప్పటికప్పుడు ఉద్యమానికి కొత్త ఊపిరిలూదుతూ.... తెలంగాణలోని అన్ని వర్గాలు అందులో పాలుపంచుకునేలా వ్యవహరించడంలో తనదైన సత్తా చాటారు. కేసీఆర్ వ్యవహార సరళి కారణంగానే తెలంగాణలోని అన్ని వర్గాలు కూడా ఉద్యమ బాటలోకి దూకడమే కాకుండా... తమ చిరకాల వాంఛ అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు.ఉద్యమ సమయంలో గానీ తెలంగాణ సీఎంగా నాలుగేళ్ల పాటు కొనసాగిన కాలంలో గానీ కేసీఆర్ దాదాపుగా ఎప్పుడూ నిర్వేదంగా గానీ బాధ పడుతున్నట్లుగా గానీ మనకు కనిపించలేదనే చెప్పాలి. అసలు కేసీఆర్‌కు బాధపడే సందర్భమే రాలేదని కూడా చెప్పాలేమో. ఈ క్రమంలో కేసీర్ కంట కన్నీరు కనిపించడం ఆయన వెక్కి వెక్కి ఏడుస్తూ... శోకసంద్రంలో మునిగిపోయిన వైనం ఇప్పుడు తెలంగాణ వాసులనే కాకుండా యావత్తు తెలుగు ప్రజలను కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. అయినా కేసీఆర్ కంట కన్నీటికి కారణమైన విషయం చెప్పనే లేదు కదా. కేసీఆర్ సోదరి విమలాబాయి నేటి ఉదయం కన్నుమూశారు. 82 ఏళ్ల వయసున్న విమలాబాయికి సంబంధించి పూర్తి వివరాలైతే తెలియదు గానీ... ఆమె మరణ వార్త తెలియగానే కేసీఆర్ చలించిపోయారు.

ఎంత సీఎం అయినా... కేసీఆర్ కూడా ఓ తమ్ముడే కదా. తోడబుట్టిన సోదరి మరణవార్త విన్నంతనే కేసీఆర్ తనను తాను నిలువరించుకోలేకపోయారు. సోదరి మృతదేహం వద్దకు వెళ్లేంత వరకూ కాస్త నిబ్బరంగానే కనిపించిన కేసీఆర్.... విమలాబాయి పార్థీవదేహాన్ని చూడగానే తనను తాను సంభాళించుకోలేకపోయారు. అక్కడే నిలబడి బోరున విలపించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కళ్ల వెంట కన్నీటి ధారలు కనిపించాయి. ఆ కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకుంటూనే అక్కతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్... చాలా సేపు అలానే ఏడుస్తూ కనిపించారు. మొత్తంగా మానసికంగా ధైర్యవంతుడిగా పేరున్న కేసీఆర్... సోదరి మరణంతో కన్నీరు పెట్టుకున్నారు.