Begin typing your search above and press return to search.

విపక్షాల విమర్శల దుమ్ము దులిపేయనున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   4 Aug 2015 4:13 AM GMT
విపక్షాల విమర్శల దుమ్ము దులిపేయనున్న కేసీఆర్
X
కొద్దికాలంగా మౌనంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. విపక్షాల మీద విరుచుకుపడనున్నారా? గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విరుచుకుపడుతున్న నేతలకు షాక్ ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారా? ఒకరికొకరుగా చేస్తున్న విమర్శలు మొత్తానికి టోకుగా పంచ్ డైలాగులతో.. విపక్షాల్ని ఉతికి ఆరేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సిద్ధం కానున్నారా? అంటే అవుననే జవాబు వినిపిస్తోంది.

మరోనెలలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అసెంబ్లీ సాక్షిగా.. ఇంతకాలం తనపై .. తన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శల మీద విమర్శలు చేస్తున్న తెలంగాణ విపక్షాలు మొత్తానికి హోల్ సేల్ గా సమాధానం ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు.

ఉరికే మాట్లాడటం కాకుండా.. తన రాజకీయప్రత్యర్థులకు కొంత అవకాశం ఇచ్చేసి.. ఆ తర్వాత తాను సీన్లోకి వచ్చేసి.. తనపై విమర్శలు చేసిన వారిని బండకేసి బాదినట్లుగా బాదేయటం కేసీఆర్ కు కొత్తేం కాదు. అయితే.. ఈ మధ్య కాలంలో తగిన అవకాశం.. వేదిక లేకపోవటం.. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే.. తానుచెప్పిన విషయాలు ప్రజల్లోకి నేరుగా వెళ్లటంతో పాటు.. విపక్షాల్ని చిత్తు చేయొచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.

తాజాగా తనను కలిసిన మంత్రులతో భేటీ అయిన సందర్భంగా.. ఉస్మానియా ఆసుపత్రి తరలింపు వ్యవహారంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయని.. ఈ ఇష్యూతో తెలంగాణ సర్కారు పేరు ప్రఖ్యతుల్ని విపక్ష నేతలు తీవ్రంగా దెబ్బ తీస్తున్నారని.. దీనికి సమాధానం చెప్పాలంటూ కేసీఆర్ ను కోరగా.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. ఇలాంటి విమర్శలు మొత్తానికి సమాదానం చెప్పటమే కాదు.. వారి నోట మాట రాకుండా చేస్తానని సీఎం చెప్పినట్లుగా టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.