కేసీఆర్ ను కన్వీన్స్ చేయటం వారిద్దరికే సాధ్యమా?

Thu Oct 12 2017 23:00:01 GMT+0530 (IST)

అడగందే అమ్మ అయినా పెట్టదని అంటారు. అయితే.. అడిగితే తీరుతో అడగాలే కానీ.. ఇష్టం వచ్చినట్లుగా అడిగితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్సలు ఇష్టం ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే.. రైతులకు మద్దతు ధర ఇవ్వండి.. ఇలా కోర్కెల చిట్టా తెర మీదకు తీసుకొస్తే ఒళ్లు మండిపోతుందేమో?పర్సనల్ గా వెళ్లి కేసీఆర్‌ను కలిసి.. ఆయన మనసు దోచుకునేలా అడిగితే ఆయన దేనికైనా ఓకే అంటారా? అంటే అవుననేలా ఉన్నాయి ఆయన మాటలు. తనను అడిగే తీరులో అడగాలే కానీ.. ఏమైనా ఇవ్వనా? అన్నట్లుగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

ఒకేరోజు కొడుకు.. మేనల్లుడి నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఇద్దరి గురించి సమానంగా పొగిడేసి బ్యాలెన్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ తో పోలిస్తే.. కొడుకు కమ్ మంత్రి కేటీఆర్ గురించి ఆసక్తికర ముచ్చట చెప్పుకొచ్చారు.

జిల్లా ఇస్తే చాలన్న మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్.. తర్వాత మెడికల్ కాలేజీ అడిగారని.. ఇప్పుడేమో కలెక్టరేట్.. ఎస్సీ ఆఫీసులు అడిగి తెచ్చుకోవటమే కాదు.. ఏడాదిలో బ్రహ్మాండంగా తయారు చేయిస్తున్నారన్నారు.

వాస్తవానికి కొడుకుతో పోలిస్తే.. మేనల్లుడి గురించి ముచ్చట చెప్పటం కేసీఆర్ కు అలవాటు. తాజా ఎపిసోడ్ లో మాత్రం కొడుకు గురించి ముచ్చట్లు చెప్పే క్రమంలో.. కొడుకు తనను ఏ రీతిలో కన్వీన్స్ చేస్తారో చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రామారావు (కేటీఆర్ అనలేదు) బాగా ఉషారైండని.. సిరిసిల్ల నీళ్లు బాగానే ఒంటబట్టినట్లుగా పేర్కొన్నారు. జిల్లా ఇస్తే ఇంకేం అడగనని చెప్పాడని.. ఇప్పుడేమో రూ.300.. 400 కోట్లకు దెబ్బ పెట్టాడని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

జిల్లా ఇవ్వాల్సిందేనని చెప్పి.. సిరిసిల్లను జిల్లాను చేసుకొని.. ఇప్పుడేమో తన పెండ్లి జరిగిన సిరిసిల్లను డెవలప్ చేయాలని చెబుతూ.. నిధులు అడుగుతున్న వైనాన్ని వెల్లడించారు. సిరిసిల్లలో తాను సైకిల్ మీదా.. కారులోనూ.. హెలికాఫ్టర్ లోనూ తిరిగిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. మొత్తానికి కొడుకు.. మేనల్లుడు అడిగితే తాను కాదనలేనన్న విషయాన్ని కేసీఆర్ తాజా ఉదంతంలో స్పష్టం చేశారని చెప్పారు.