Begin typing your search above and press return to search.

20 నియోజ‌క‌వ‌ర్గాలు...అక్క‌డ రోడ్‌ షోలు

By:  Tupaki Desk   |   9 Nov 2018 9:25 AM GMT
20 నియోజ‌క‌వ‌ర్గాలు...అక్క‌డ రోడ్‌ షోలు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌చారంలో భాగంగా త‌న ప్లాన్ బీని సిద్ధం చేసుకున్నారా? నిజామాబాద్‌ - నల్లగొండ - వనపర్తి బహిరంగ సభల తర్వాత సైలెంటయిపోయిన టీఆర్‌ ఎస్‌ అధినేత త్వ‌ర‌లో ప్ర‌జాక్షేత్రంలో ప‌ర్య‌టించ‌నున్నారా? మరో రెండు మూడు రోజుల్లో రెండో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. ఈ ద‌ఫా విభిన్నంగా గులాబీ ద‌ళ‌ప‌తి ప్ర‌చారం సాగ‌నుంద‌ని అంటున్నారు. మూడు స‌భ‌ల త‌ర్వాత తాజాగా కేసీఆర్ త న ప్ర‌చారంపై దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. మొత్తం 20 నియోజకవర్గాలు మినహా మిగతా అన్నింటిలోనూ ఆయన ప్రచారం నిర్వహిస్తారు. ఇందుకోసం ఇప్పటికే గులాబీ బాస్‌ పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. సిద్ధిపేట - సిరిసిల్ల - గజ్వేల్‌ - హుజూర్‌ బాద్‌ లలో భారీ మెజారిటీతో గెలుస్తుందని భావిస్తున్న కేసీఆర్ అక్క‌డ ప్ర‌చారం చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం.

రెండో విడత ప్రచారాన్ని ఈపాటికే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ మహా కూటమి అభ్యర్థుల జాబితా రాకపోవటంతో వాయిదా వేసినట్టు స‌మ‌చారం. కూటమి జాబితా వస్తే ప్రత్యర్థులను - ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ముమ్మరంగా ప్రచారం సాగించవచ్చన్నది కేసీఆర్‌ లక్ష్యమని ఆయా వర్గాలు వివరించాయి. లేదంటే క్యాంపెయిన్‌ వన్‌ సైడ్‌ గానే ఉంటుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. మహాకూటమి జాబితాను రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశమున్నందున... ఆ వెంటనే కేసీఆర్‌ ప్రచారం కూడా ప్రారంభమవుతుందని వివరించారు. టీఆర్‌ ఎస్‌ ప్రచారానికి సంబంధించిన పాటలను కూడా కేసీఆరే స్వయంగా రచించారు. వాటిని త్వరలోనే విడుదల చేయబోతున్నారని సమాచారం. మరోవైపు కొన్ని జిల్లా కేంద్రాలతోపాటు ప్రతిపక్షాలకు బాగా బలమున్న నియోజకవర్గాల్లో సైతం రోడ్‌ షోలు నిర్వహించాలని కేసీఆర్‌ గతంలో భావించారు. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా రోడ్‌ షోలు చేయాల్సిన అవసరం లేదంటూ పార్టీ నేతలు ఆయనకు చెప్పారు. అందువల్ల ఒక్క హైదరాబాద్‌ మినహా మిగతా అన్ని చోట్లా కేసీఆర్‌ బహిరంగ సభలకే పరిమితమవుతారని స‌మాచారం. ఇదే సమయంలో ఎమ్‌ ఐఎమ్‌ తో దోస్తీ కొనసాగిస్తున్నప్పటికీ రాజేంద్రనగర్‌ - నిజామాబాద్‌ లాంటి చోట్ల కూడా కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ రెండు స్థానాలూ ఇప్పుడు టీఆర్‌ ఎస్‌ ఖాతాలో ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ తమ అభ్యర్థిని నిలిపి తీరతామంటూ ఎమ్‌ఐఎమ్‌ స్పష్టం చేసిందని సమాచారం. ఆ పార్టీ ఆయా స్థానాల్లో అభ్యర్థులను నిలిపితే.. కచ్చితంగా సీఎం ప్రచారం నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఇదే స‌మ‌యంలో క్షేత్రస్థాయిలో అభ్యర్థులతో ఎప్పటికప్పుడు ఫోన్‌ లో మాట్లాడుతూ.. అక్కడి రాజకీయ పరిస్థితులను - ప్రచార సరళిని తెలుసుకుంటున్నారు. కాగా, కీల‌క‌మైన టీఆర్‌ ఎస్‌ పూర్తిస్థాయి మ్యానిఫెస్టో రూపకల్పన పూర్తి కావచ్చిందని.. రెండు - మూడు రోజుల్లో విడుదల చేస్తారని స‌మాచారం. 11వ తేదీ అభ్య‌ర్థుల‌తో స‌మావేశం అనంత‌రం మ్యానిఫెస్టో విడుద‌ల ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.