Begin typing your search above and press return to search.

టీ ఆర్టీసీకి నష్టాలు..కేసీఆర్ మాటల్లో నిజమెంతంటే?

By:  Tupaki Desk   |   12 Oct 2019 5:35 AM GMT
టీ ఆర్టీసీకి నష్టాలు..కేసీఆర్ మాటల్లో నిజమెంతంటే?
X
తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని చెప్పటమే కాదు.. దాన్ని నిజమని నమ్మించే సత్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతంగా పలువురు చెబుతుంటారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందన్న మాటలు విన్నప్పుడు ఈ పోలిక నూటికి నూరుశాతం నిజంగా చెప్పక తప్పదు. ప్రభుత్వ విధాన లోపంతో.. నిర్లక్ష్యంతో నష్టాల బాట పట్టిన ఆర్టీసీని బొంద పెట్టటానికి టీఆర్ ఎస్ సర్కారు సిద్ధమవుతున్న భావన కలుగక మానదు.

ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం రూ.3వేల కోట్ల అప్పుల్లో ఉన్నట్లు కేసీఆర్ సారు చెబుతారు. కానీ.. అదే సమయంలో వివిధ రాయితీలు తీసుకునే ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.1700 కోట్ల బకాయిల గురించి ఎందుకు చెప్పరు. అంతేనా? ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1700 కోట్లకు బదులుగా.. ఒక పెద్ద మనిషి దగ్గర రూ.వెయ్యి కోట్ల అప్పు ఇప్పించి.. దానికయ్యే వడ్డీని ఆర్టీసీ చేత కట్టించే తెలివి కేసీఆర్ సొంతం. అంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి.. నా డబ్బులు నాకివ్వమని అడిగితే.. నీకు వేరే వాళ్ల దగ్గర అప్పు ఇప్పిస్తానని చెప్పటమే కాదు.. ఆ అప్పుకు వడ్డీ కూడా చెల్లించాలన్న రూల్ పెడితే ఎలా ఉంటుందో.. కేసీఆర్ సారు ఆర్టీసీ విషయంలో అదే పని చేస్తున్నారన్నది మర్చిపోకూడదు.

అంతేనా.. ఆర్టీసీకి ఏటా మోటారు వాహనాల పన్ను కింద ప్రభుత్వం వసూలు చేస్తున్న రూ.240 కోట్ల మాటేంటి? లాభార్జన ప్రధాన ధ్యేయంగా కాకుండా సేవాభావంతో పని చేసే ఆర్టీసీ లాంటి సంస్థకు మోటారు వెహికిల్ ట్యాక్స్ పేరుతో రూ.240 కోట్లు వేయటం ఎంతవరకు న్యాయం? ఇంతేనా.. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలానే ఉంటుందని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన 2014లో డీజిల్ ధరకు.. ప్రస్తుతం ఉన్న డీజిల్ ధరకు పోలికే లేదు. దాదాపు లీటరుకు రూ.25 వరకూ పెరిగింది. మరింత భారీగా పెరిగిన తర్వాత కూడా.. అందుకు తగ్గట్లు టికెట్ల ధరల్ని పెంచలేదు కదా? మరి.. ఆ భారం ఎవరు మోయాలి?

డీజిల్ ధర పెరగటం ఒక ఎత్తు అయితే.. డీజిల్ మీద వేసే వ్యాట్ పన్ను మాటేమిటి? డీజీల్ మీద విధించే పన్ను కారణంగా ఆర్టీసీ కొనుగోళ్ల మీద ఏటా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.590 కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో రాష్ట్ర వాటానే రూ.200 కోట్లు. ఇక.. బస్సులకు వాడే టైర్లు మొదలు..విడిభాగాల మీద వసూలు చేసే జీఎస్టీ చెల్లింపులు రూ.100 కోట్ల వరకూ ఉంటాయి. ఈ లెక్కలు ఒక ఎత్తు అయితే.. ఇంత పెద్ద ఆర్టీసీ నేటికి ప్రైవేటుగానే డీజిల్ కొనుగోలు చేస్తుందే తప్పించి.. డీలర్ షిప్ లేదు.

ఒకవేళ డీజిల్ డీలర్ షిప్ ఆర్టీసీ తీసుకొని ఉంటే.. లీటరుకు రూ.8 పైసలు నుంచి రూ.10 పైసలు వరకూ మిగులుతుంది. చూసేందుకు చిన్న మొత్తంగా కనిపిస్తున్నా.. అసలు లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఏడాదిలో ఆర్టీసీ బస్సులు తిరిగే కిలోమీటర్లు ఏకంగా 36 లక్షలు. ఒక లీటరు డీజిల్ తో 5 కి.మీ. మైలేజీ ఉంటుంది. ఈ లెక్కన 36 లక్షల కిలోమీటర్లను 5 కి.మీ. లెక్కన చూస్తే.. ఏడాదికి 7.2లక్షల లీటర్లు ఇంధనం కొనుగోలు చేస్తుంది. ఐదు పైసలు చొప్పున లెక్క వేసినా వచ్చే మొత్తం కోట్లల్లో ఉంటుందన్నది మర్చిపోకూడదు.

చిన్న చిన్న విషయాలు మొదలు పెద్ద విషయాల వరకూ ప్రతి విషయంలోనూ ఆర్టీసీకి నష్టం జరిగేలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. సంస్థకు నష్టాలు రాక.. లాభాలు వస్తాయా? అన్నది ప్రశ్న. అంతేనా.. ఆర్టీసీకి ఉపయోగించే టైర్ల కోసం బయట కంపెనీల్లో కొనుగోలు చేసే బదులు.. సొంతంగా టైర్ల పరిశ్రమ ఎందుకు పెట్టరు? తనకు అవసరమైన టైర్లను వినియోగించుకోవటంతో పాటు.. టైర్ల వ్యాపారం మొదలు పెడితే..మరింత లాభం రావటమే కాదు.. భారీ ఎత్తున ఉపాధి అవకావశాలు లభిస్తాయి కదా?

అంతేనా.. ఆర్టీసీకి ఉన్న ఆస్తుల్ని సరైన రీతిలో కమర్షియల్ గా మారిస్తే.. వాటి మీద వచ్చే ఆదాయం భారీగా ఉంటుంది. ఎక్కడి దాకానో ఎందుకు మెగా ఇంజనీరింగ్ సంస్థనే ఉదాహరణగా తీసుకుంటే.. వారు చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా సరే.. ఆ ప్రాజెక్టుకు అవసరమైన కీలకమైన వస్తువుల్ని తయారు చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే ధోరణి మొదటి నుంచే ఉంది. కేసీఆర్ కు దగ్గరి దోస్త్ అయిన మెగా అధినేత ఫాలో అయ్యే పద్దతుల్ని అనుసరించినా తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో కాదు.. భారీ లాభాల్లోకి వస్తుందన్న విషయం అర్థమవుతుంది. మరీ విషయాలు చెప్పని కేసీఆర్ ఎప్పటికప్పుడు నష్టాల మాట ఎందుకు మాట్లాడుతున్నట్లు?