Begin typing your search above and press return to search.

తెలంగాణలో మూడూ తేలిపోయినట్టే!

By:  Tupaki Desk   |   24 Feb 2018 7:23 AM GMT
తెలంగాణలో మూడూ తేలిపోయినట్టే!
X
రెండు తెలుగురాష్ట్రాలకూ మూడేసి రాజ్యసభ సీట్లకు ఎన్నకలు జరగబోతున్నాయి. షెడ్యూలు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి.. ఈసారి రాజ్యసభ ఎన్నికలు చాలా రంజుగా జరిగే అవకాశం ఉంది. బేరసారాలు కుట్రలు - కొత్త ఫిరాయింపులు - ఎమ్మెల్యేల కొనుగోళ్లు వంటివి అనేకం చోటుచేసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది.

కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మొత్తం పేలవంగా, సాఫీగా కనిపిస్తోంది. అక్కడ ఉండే మూడు స్థానాలు తెరాసకే దక్కే అవకాశం ఉంది. పైగా ఆ పార్టీలో కూడా.. పెద్దగా అసంతృప్తులు - తిరుగుబాట్లు ఉండే పరిస్థితి లేదు. కేసీఆర్ ఎంత చెబితే అంతే.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మరణించిన పాల్వాయి గోవర్దన్ రెడ్డి స్థానంతో పాటు - ఇప్పుడు సీఎం రమేష్ - రాపోలు ఆనందభాస్కర్ సీట్లు కూడా ఖాళీ అవుతున్నాయి. సీఎం రమేష్ ఏపీకి చెందిన నాయకుడే అయినప్పటికీ.. విభజన తర్వాత ఆయన ఎంపీ పదవి తెలంగాణ కోటాలోకి వెళ్లింది. ఈ మూడు స్థానాలకు సంబంధించి ఆల్రెడీ ఎంపికలు కూడా దాదాపు గా పూర్తియిపోయినట్లే అని తెరాస పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న సంతోష్ కుమార్ ను మొదటి రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ ఎన్నడో ఖరారు చేసేశారు. సంతోష్ కుమార్ కేసీఆర్ సమీప బంధువు కూడా కావడం విశేషం. మిగిలిన రెండు ఎంపీ సీట్లలో ఒక దానిని యాదవులకు కేటాయిస్తానని కూడా కేసీఆర్ గతంలోనే వెల్లడించారు. ఆ మేరకు కొందరు యాదవ వర్గానికి చెందిన నేతలు ఈ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారినుంచి ప్రతిస్పందన ఉండేంత వాతావరణం లేదు.

మూడో స్థానం విషయంలోనే ఇంకా తేలలేదు. అయితే తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి దివంగత నాయకుడు మాధవరెడ్డి భార్య ఉమా మాధవరెడ్డి ఇటీవల తెరాస తీర్థం పుచ్చుకున్నారు. కొడుకుతో సహా ఆమె తెరాసలోకి వచ్చారు. ఆమె గతంలో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే పార్టీ మారుతున్న సమయంలో ఆమె తనను రాజ్యసభకు పంపేలా కేసీఆర్ నుంచి మాట తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అదే నిజమై, ఆ మాటను కేసీఆర్ మన్నిస్తే గనుక.. తెలంగాణలో మూడు స్థానాలూ అప్పుడే ఫైనలైజ్ అయిపోయినట్లే అని అంతా అనుకుంటున్నారు.