Begin typing your search above and press return to search.

కేంద్రానికి కేసీఆర్ ఆర్థిక పాఠాలు

By:  Tupaki Desk   |   13 Jan 2019 10:35 AM GMT
కేంద్రానికి కేసీఆర్ ఆర్థిక పాఠాలు
X
మూస ఆర్థిక విధానాలతో కేంద్రంలోని ప్రభుత్వాలు రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తున్నాయని... ఇలాంటి కాలం చెల్లిన ఆర్థిక విధానాల స్థానే ఆర్థిక వ్యవస్థకు గుణాత్మక మార్పును అందించే పద్ధతులు సంతరించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాల విషయంలో కేంద్రం జోక్యం వద్దని నీతి ఆయోగ్ లో కూడా చెప్పానని.. అయినా కేంద్రం పెత్తనం చెలాయిస్తుందన్నారు. రాష్ట్ర ప్రగతిని దేశ ప్రగతిగా భావించని.. పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రం నిరుత్సాహపరచకూడదని.. రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య ఉండాల్సి రాజ్యాంగ బంధం కనుమరుగవుతుందని.. రాష్ట్రాల అధికారాలు - హక్కుల పంపిణీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రాలను కించపరిచేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

భారత ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు ఆర్థిక సంఘం నడుం బిగించాలే కానీ మూస పద్ధతులతో తుప్పు పట్టించరాదన్నారు. కొద్దిరోజుల్లో 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ బృందం రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ - ఇతర సీనియర్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్రకాలం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వచ్చిన అనేక పార్టీల ప్రభుత్వాలు ఎటువంటి గుణాత్మక మార్పును తీసుకురాలేకపోయాయని సీఎం కేసీఆర్‌ చేప్పారు. ఈ నేపథ్యంలో తిరిగి లోతయిన విశ్లేషణ - ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో నిరసన వ్యక్తం చేస్తుండడం విచారకరమన్నారు. దీనికి కాంగ్రెస్‌ - బీజేపీ అనే రెండు రాజకీయ వ్యవస్థలే మూలకారణమని సీఎం స్పష్టం చేశారు.

ఫైనాన్స్‌ కమిషన్‌ పాత్రను ప్రస్తావిస్తూ.. ‘‘రాష్ట్రాలలో పర్యటించే క్రమంలో ఫెనాన్స్‌ కమిషన్‌ సభ్యులు ముందే ఒక అభిప్రాయాన్ని కలిగి వుండడం సరికాదు. రాష్ట్రాన్ని పర్యటించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా క్షేత్ర స్థాయి పర్యటనకు ముందే ఒక అవగాహనతో టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ చేయడం సరికాదు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సాంస్కృతిక - ఆర్థిక జీవిక వుంటుంది. ఆయా రాష్ట్రాల అవసరాల రీత్యా డివల్యూషన్‌ అంశం రాష్ట్రాల హక్కుగా పరిగణించి.. కేవలం విధానాల రూపకల్పనకు మాత్రమే ఫైనాన్స్‌ కమిషన్‌ పరిమితమైతే మంచిది” అన్నారు.

చర్చించిన ఈ అంశాలన్నీ పరిశీలించి - తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు.