Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇంత బ‌ల‌హీనుడా?

By:  Tupaki Desk   |   3 Aug 2015 5:44 AM GMT
కేసీఆర్ ఇంత బ‌ల‌హీనుడా?
X
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో దిట్ట‌. అయితే ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ త‌ర‌చుగా తీసుకుంటున్న ఓ నిర్ణ‌యం ఇపుడు కేసీఆర్ శైలిని ప్ర‌శ్నించేదిగా మారింది.

తెలంగాణ సర్కారులో మంత్రివర్గ ఉపసంఘాల జోరు కొనసాగుతోంది. సమస్యల పరిష్కారం మొదలు... నూతన విధానాల రూపకల్పన వరకు... కేబినేట్ సబ్‌-కమిటీలనే కేసీఆర్ నమ్ముకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అంతా తానే వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలకమైన అంశాలపై మంత్రివర్గ ఉపసంఘంపై ఆధారపడుతున్నారు. తాజాగా ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య శాఖపై కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు తెలంగాణ సీఎం. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అధికారికంగా 14 క్యాబినేట్‌ సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ సర్కారులో మంత్రివర్గ ఉపసంఘాల జోరు కొనసాగుతుందనే ప్రచారం సాగుతోంది. మ‌రోవైపు కేసీఆర్ ఎందుకు ఇన్ని ఉప‌సంఘాలు ఏర్పాటు చేస్తున్నార‌నే సందేహం క‌లుగుతోంది.

2014 నవంబర్‌ 17న మొదలైన మంత్రివర్గ ఉప సంఘాల పరంపర నేటికీ కొనసాగుతోంది. ఇదే రోజు సీఎం కేసీఆర్.. రైతు రుణమాఫీ, మిషన్‌ కాకతీయపై రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పోటీ పరీక్షల విధానం, సిలబస్‌ మార్పు, వయో పరిమితి పెంపు తదితర అంశాలను చర్చించేందుకు డిప్యూటీ సీఎం కడియం అధ్యక్షతన మరో కమిటీ వేశారు. ఇక పెండింగ్ ప్రాజెక్టుల పనులు, సర్వశిక్ష అభియాన్లపై మరో మంత్రుల కమిటీ పనిచేస్తున్నాయి. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ కోసం ఓ క్యాబినేట్‌ కమిటీ, గోదావరి పుష్కరాలు, ఆర్టీసీతో పాటు తాజాగా మున్సిపల్‌ సమ్మెలపైనా కమిటీలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు ఇపుడు మరో సబ్‌ కమిటీని నియమించారు సీఎం కేసీఆర్. వాణిజ్య పన్నుల అంశాలపై అధ్యయనానికి మంత్రి తలసాని అధ్యక్షతన మరో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు. పన్నుల ఎగవేతను అరికట్టడంతో పాటు పన్నులు కట్టకుండా ఆదాయాన్ని రాబట్టడంపై ఈ మంత్రుల కమిటీ పనిచేస్తుంది.

కీలకమైన పలు అంశాలపై పూర్తిస్థాయిలో కూలంకుశంగా అధ్యయనం చేస్తున్న కమిటీలు.. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, గత ప్రభుత్వాల అనుభవాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. ఆయా శాఖ మంత్రుల సలహాలు, అధికారుల సూచనలకే పరిమితం కాకుండా ఈ కమిటీలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే మంత్రివర్గ ఉపసంఘాలు ప్రభుత్వాల్లో సర్వసాధారణమైనా...ఏడాది పాలనలో 14 సబ్‌ కమిటీలను నియమించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆయా విష‌యాల్లో ప‌ట్టులేక‌పోవ‌డం వ‌ల్ల కేసీఆర్ ఇలా చేస్తున్నారా లేక‌...నిర్ణ‌యం తానొక్క‌డినే తీసుకున్నాన‌నే భావ‌న రాకుండా ఈ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా అనే చ‌ర్చ సాగుతోంది.