Begin typing your search above and press return to search.

మరి.. శ్రీకాంతాచారి పేరుతో జిల్లా లేదేం?

By:  Tupaki Desk   |   4 Dec 2016 7:33 AM GMT
మరి.. శ్రీకాంతాచారి పేరుతో జిల్లా లేదేం?
X
తెలంగాణ అధికారపక్ష నేతలు చెప్పే మాటలు.. కొందరు ముఖ్యనేతలు చేసే వ్యాఖ్యలు లేనిపోని సమస్యలకు తావిచ్చేలా చేయటమే కాదు.. ప్రజల మనసుల్లో పలు సందేహాలు వెల్లువెత్తేలా ఉండటం కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా భావోద్వేగ రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరి చేసే తత్వం ఉన్న టీఆర్ ఎస్ కు.. ఇప్పుడు అదే శాపంగా మారనుందా? అన్నది సందేహంగా మారుతోంది.

తెలంగాణ ఉద్యమం మలిదశలో.. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి ఉదంతం తెలంగాణ సమాజాన్ని ఎంతగా కదిలించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీకి దడ పుట్టించేలా చేసిన ఈ ప్రాణ త్యాగంతో.. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం కొత్త రూపం దాల్చిందనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్షతో జీవితాన్ని పణంగా పెట్టిన శ్రీకాంతాచారి పేరును పదే పదే ప్రస్తావించే తెలంగాణ అధికారపక్ష నేతలు.. తమ చేతిలో పవర్ ఉన్నా.. ఆయన ఆకాంక్షలకు తగ్గట్లుగా చేసిందేమీ లేదన్న భావనను పలువురు వినిపిస్తూ ఉంటారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పేర్లు తెలంగాణ రాష్ట్రంలో చిరస్థాయిగా నిలుస్తాయని చెబుతుంటారు.

ఇలాంటి మాటల్ని తరచూ టీఆర్ఎస్ నేతలు పలువురు చెబుతుంటారు. నిజమే.. ఇందులో కొంత నిజం ఉందనే చెప్పాలి. కేసీఆర్ పేరును చరిత్రలో నిలిచేలా చేయటం కోసం ప్రయత్నాలు ఎప్పుడో షురూ అయ్యాయి. కానీ.. తన ప్రాణ త్యాగంతో తెలంగాణ సమాజాన్ని కదిలించిన శ్రీకాంతాచారి గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చేసిందా? అంటే అది ప్రశ్నగానే మిగిలిపోతుందని చెప్పాలి.

గడిచిన రెండున్నరేళ్లుగా పవర్ చేతిలో ఉన్నప్పుడూ.. నిజంగానే శ్రీకాంతాచారి పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేయాలంటే ఏమైనా చేసి ఉండొచ్చు. ఈ మధ్యన ప్రకటించిన కొత్త జిల్లాల పేర్లలోఒక జిల్లాకు ఆయన పేరు పెడితే సరిపోయేది. కానీ.. అలాంటిదేమీ చేయని ప్రభుత్వం.. అందుకు భిన్నంగా ఆయన పేరు మీద ఇప్పటికి పెద్ద.. పెద్ద మాటలు చెబుతున్న తీరు చూస్తే.. మాటలే తప్ప చేతలు శూన్యమన్న అభిప్రాయం కలగటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/