Begin typing your search above and press return to search.

కేసీఆర్ దత్తపుత్రిక లవ్వర్ దొరికాడు

By:  Tupaki Desk   |   3 May 2016 6:10 AM GMT
కేసీఆర్ దత్తపుత్రిక లవ్వర్ దొరికాడు
X
సవితి తల్లి చేత దారుణ హింసకు గురై.. మానసికంగా అనారోగ్యం పాలైన ప్రత్యూష ఉదంతం అందరికి గుర్తుండే ఉంటుంది. ఆమె ఉదంతం విన్న వారంతా కదిలిపోవటమే కాదు.. ఆమెకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రత్యూష ఉదంతం గురించి విన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆమెను తన ఇంటికి పిలిపించుకోవటమేకాదు.. తన ఇంట్లోనే ఉంచుకుంటానని కూడా చెప్పారు. అంతేకాదు.. ప్రత్యూషకు తానే గార్డియన్ గా ఉంటానని.. ఆమె చదువు సంధ్యలతో పాటు.. పెళ్లి కూడా తానే చేస్తానని ఆయన అప్పట్లో చెప్పటం జరిగింది.

తాను నర్సింగ్ కోర్సు చేస్తానని ప్రత్యూష చెప్పటం.. అందుకు తగ్గట్లుగా ఆమె చదువుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు. ఇదిలా ఉంటే ప్రత్యూష ఇటీవల ప్రేమలో పడటం.. తాను ప్రేమించిన యువకుడ్ని పెళ్లాడాలన్న బలమైన కాంక్షను వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రేమికుడితో ప్రత్యూష కలిసి ఉన్న ఫోటోలు వాట్సప్ లో బయటకు రావటంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు.. సదరు కుర్రాడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రత్యూష ప్రేమలో పడిన కుర్రాడిది కర్నూలు జిల్లాగా గుర్తించారు. మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడిన అధికారులు తాజాగా వాటిని సేకరించినట్లుగా చెబుతున్నారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తిగా ప్రత్యూష మానసచోరుడ్ని గుర్తించారు. సదరు కుర్రాడి పేరు మద్దిలేటి అలియాస్ బుజ్జి అని.. ఇతగాడు స్థానిక ఆటోమొబైల్ దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలలో ప్రత్యూష చికిత్స పొందే సమయంలో మద్దిలేటితో పరిచయం జరిగిందని చెబుతున్నారు. తన బంధువుల కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో మద్దిలేటికి ప్రత్యూష పరిచయం అయ్యిందని తెలుస్తోంది. మరి.. దత్తపుత్రిక ప్రేమ వ్యవహారంపై మఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో..?