Begin typing your search above and press return to search.

పెళ్లి చేయమంటున్న కేసీఆర్ దత్త పుత్రిక

By:  Tupaki Desk   |   1 May 2016 6:35 AM GMT
పెళ్లి చేయమంటున్న కేసీఆర్ దత్త పుత్రిక
X
సవతి తల్లి - తండ్రి చేతిలో నరకయాతన పడి చివరకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అక్కడి నుంచి బయటపడిన హైదరాబాద్ యువతి ప్రత్యూష గుర్తుండే ఉంటుంది. ఒళ్లంతా దెబ్బలు - మొఖంపై కాలిన గాయాలతో అందరికీ కన్నీళ్లు తెప్పించిన ఆ యువతి కష్టం చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చలించిపోయారు. ఆమెను కష్టాల నుంచి బయటపడేసేందుకు ఆదేశాలిచ్చారు. అంతేకాదు... ఆమె బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి ఆమెను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రత్యూష ప్రతి పండుగకు కేసీఆర్ ఇంటికొస్తోంది. చదివించడంతో పాటు ఆమె పెద్దయ్యాక పెళ్లి కూడా తానే చేస్తానని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు.

అయితే... ఇప్పుడు ప్రత్యూషకు కేసీఆర్ పెళ్లి చేయాల్సిన టైమొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న ప్రత్యూష ఓ యువకుడిని ప్రేమించి.. ఆ కుర్రాడితో తనకు పెళ్లి జరిపించాలని కోరుతోంది. ప్రత్యూష ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ హాస్టలులో ఉంటూ నర్సింగ్ చదువుతోంది. అయితే... ఇక తాను చదువుకోనని.. తనను ప్రేమిస్తున్న యువకుడితో పెళ్లి చేయించాలని అధికారులను కోరింది. ప్రత్యూష కేసు అప్పట్లో హైకోర్టు సుమోటోగా చేపట్టి ఆమెను ఈ హాస్టల్ లో ఉంచాలని ఆదేశించడంతో అధికారులు ఈ విషయాన్ని హైకోర్టుకు తొలుత చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయానికీ సమాచారం ఇచ్చారు. తాము ప్రత్యూష విషయంలో నిర్ణయం చెప్పేవరకు బాయ్ ఫ్రెండ్ ను, ఆమెను కలిసేందుకు అనుమతించరాదంటూ హైకోర్టు అధికారులకు సూచించింది.

మరోవైపు చదువుకున్న తరువాత పెళ్లి చేసుకోవమ్మా అని అధికారులు నచ్చజెబుతున్నా ప్రత్యూష ససేమిరా అంటోందట. కాగా సీఎంఓకు కూడా సమాచారం చేరడంతో ఆ కుర్రాడి వివరాలు తెలుసుకోవాలని కేసీఆర్ ఆదేశించారట. కుర్రాడిది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డని... ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడట. మరి ఈ దత్త పుత్రిక విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... ఏ రేంజిలో పెళ్లి జరిపిస్తారో చూడాలి.