Begin typing your search above and press return to search.

తెలంగాణలో పార్టీలన్నీ ఏకం కావాలంటున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   4 May 2016 5:23 AM GMT
తెలంగాణలో పార్టీలన్నీ ఏకం కావాలంటున్న కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాల్ని ఎంతగా వాడేస్తారన్న విషయంలో తనకున్న నైపుణ్యాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రదర్శించారు కూడా. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పే మాటలకు.. ఇచ్చే పిలుపులకు తెలంగాణలోని ఆయన ప్రత్యర్థి పార్టీలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నేతలు తరచూ ఒక మాట చెప్పేవారు. ఉద్యమ నాయకుడికి ఉండే అడ్వాంటేజ్ కేసీఆర్ కు ఉందని.. అందువల్లే ఆయన తన ప్రత్యర్థి రాజకీయపార్టీలను అంతలా ఇబ్బంది పెట్టగలుగుతున్నారని.. ఉద్యమం పూర్తి అయ్యాక ఆయన అలా చేయలేరంటూ విశ్లేషణలు చేసేవారు.

అయితే.. ఉద్యమం ముగిసి.. తెలంగాణ రాష్ట్రంలో అధికారపక్షంగా అవతరించిన తర్వాత కూడా ఉద్యమ సమయంలో ఏ తీరులో అయితే తన ప్రత్యర్థి పార్టీలను ఏ విధంగా ముప్పతిప్పలు పెట్టారో.. అధికారపక్షంగా కూడా అదే తీరులో వ్యవహరించటం కేసీఆర్ కు మాత్రమే చెల్లింది. ఓపక్క తన అవసరాల కోసం తెలంగాణలోని పార్టీలన్నీ ఏకం కావాలనిచెప్పే కేసీఆర్.. మరోవైపున తెలంగాణలో తాను తప్ప మరే రాజకీయ పార్టీ బలంగా ఉండకూడదన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే.

ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయటం.. తెలుగుదేశం పార్టీని దాదాపు ఖాళీ చేసినంత పని చేసిన కేసీఆర్ దృష్టికి కాంగ్రెస్ మీద పడిన సంగతి తెలిసిందే. ఓపక్క తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే.. వారి సాయాన్ని కేసీఆర్ అడిగే తీరు ఆయనకు మాత్రమే సాధ్యమవుతుందేమో. తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్మించాలని భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకంపై తెలంగాణ విపక్షాలతో పాటు.. ఏపీ అధికార.. విపక్షాలు వ్యతిరేకించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిఫెన్స్ లో పడినట్లు కనిపించిన కేసీఆర్.. తాజాగా పాలమూరు ఎత్తిపోతల పథకంపై తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు.

పాలమూరుకు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రాపార్టీలన్నీ ఏకమైన నేపథ్యంలో.. తెలంగాణ ప్రజల మేలు చేసే ఆ ప్రాజెక్టు కోసం తెలంగాణలోని రాజకీయ పార్టీలు కూడా ఏకం కావాలంటూ పిలుపునివ్వటం గమనార్హం. ఓపక్క తెలంగాణలోని రాజకీయ పక్షాల్ని ఖాళీ చూస్తున్న కేసీఆర్.. ఇంకోవైపు రాజకీయంగా తనకు ప్రతికూలంగా ఉన్న అంశాల్లో చేయూత కోసం అదే రాజకీయ పార్టీలు తమతో కలిసి నడావాలని అడుగుతున్న తీరు చూస్తే.. విషయం ఏదైనా తనదైన శైలిలో ఇరికించటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమనిపించక మానదు.