Begin typing your search above and press return to search.

ఇదేం ప‌ని కేసీఆర్ సాబ్‌....

By:  Tupaki Desk   |   26 Nov 2015 4:22 PM GMT
ఇదేం ప‌ని కేసీఆర్ సాబ్‌....
X
రాష్ర్ట ప్ర‌భుత్వ పాల‌న‌ప‌గ్గాలు చేప‌ట్టి ఏడాదిన్న‌ర గ‌డుస్తున్న నేప‌థ్యం ఒక‌వైపు....వ‌రంగ‌ల్ ఉప ఎన్నికలో దుమ్మురేపే విజ‌యంతో గులాబీ శ్రేణులు ఫుల్ జోష్‌ తో ఉన్న‌ట్లు పైకి క‌నిపిస్తున్నా వారిలో లోలోన అసంతృప్తితో ఉన్నారా? నామినేటెడ్ పదవులు భర్తీ కాలేదన్న అసంతృప్తికి మ‌రో నిరాశ కూడా తోడ‌యిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీ జరిగి ఏడునెల‌లు పూర్త‌యింది. ఈ ప్లీన‌రిలోనే సీఎం కేసీఆర్‌ ను పార్టీ అధినేత‌గా ఎన్నుకున్నారు. అయితే టీఆర్‌ ఎస్ ప్లీనరీలో కేసీఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా తిరిగి ఎన్నికయ్యాక జరగాల్సిన పార్టీ కమిటీల నియామకం ఇప్పటికీ పెండింగ్‌ లోనే ఉంది. అంతకుముందే పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయినా, జిల్లాస్థాయి కమిటీల భర్తీ కూడా జరగలేదు. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుడు - జిల్లా స్థాయిలో అధ్యక్షులు - నగర అధ్యక్షులు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. చివరకు అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌ పై కూడా పార్టీపరంగా దృష్టిపెట్టినట్లు కనిపించట్లేదు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న పార్టీ నాయకత్వం ఆ దిశలో పార్టీ యంత్రాంగాన్ని నడిపే ప్రయత్నం మాత్రం చేయట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీహెచ్‌ ఎంసీతోపాటే వరంగల్ - ఖమ్మం కార్పొరేషన్ లకూ...తాజాగా వ‌చ్చిప‌డిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న పరిస్థితుల్లో పార్టీ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తికానందున ఎవరు ఏ హోదాలో పనిచేయాలో తెలియని సందిగ్ధత ఏర్పడింది. తమకు ఏ పదవీ లేక, బాధ్యతలూ అప్పజెప్పకపోవడంతో ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పుకుని పనిచేయాలన్న సందేహాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న కార్పొరేషన్లు - నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో ఇప్పటికే పెదవి విరుస్తున్న పార్టీ యంత్రాంగం చివరకు పార్టీ పదవులన్నా భర్తీ చేయరా అని లోలోన మథనపడుతున్నారు.

పార్టీ అనుంబంధ విద్యార్ధి - యువజన - మహిళ - కార్మిక సంఘాల కమిటీలదీ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనూ అదే పరిస్థితి. సీఎం కె. చంద్రశేఖర్‌ రావు మరో మారు పార్టీ చీఫ్ అయిన నేప‌థ్యంలో ఆయనే రాష్ట్ర కమిటీని ప్రకటించాలి. దీంతోపాటు పొలిట్‌ బ్యూరో ఏర్పాటు చేయాలి. ఇలా ఈ నియామకాల్లోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం కార్య‌క‌ర్త‌ల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, కేబినెట్‌లో స్థానం పొందిన మంత్రులు మినహాయిస్తే పార్టీ కోసం పనిచేసిన వారెవరికీ ఎలాంటి పదవుల్లేకుండా పోయాయి. ఈ నిరాశ పార్టీ శ్రేణుల్లో బాగా పేరుకుంది. నామినేటెడ్ పదవులు భర్తీపై ఊరడింపులు మినహా అమలు కాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా నెల‌రోజుల్లో ప‌ద‌వులు అని చెప్పిన‌ప్ప‌టికీ మళ్లీ ఎన్నిక‌లు రావ‌డంతో ఈ తంతు ప‌క్క‌న‌పెట్టిన‌ట్లేన‌ని భావిస్తున్నారు. వాటిపై ఆశలు ఆవిరైన వారు, కనీసం పార్టీసంస్థాగత పదవులైనా భర్తీ అవుతాయని ఎదురు చూశారు. ఆయా జిల్లాల్లో మంత్రులు - ఎమ్మెల్యేలు తమ అనుచరుల పేర్లతో ప్రతిపాదనలు ఇస్తే కానీ కమిటీలను భర్తీ చేయలేని నిస్సహాయ స్థితిలో జిల్లా అధ్యక్షులు ఉన్నారని చెబుతున్నారు.

ఇదిలాఉండ‌గా... జంప్ జిలానీల ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా ఉంది. నామినేటెడ్ పదవులు ఆశ చూపి పార్టీలోకి చేర్చుకున్న తమకు చివరకు పార్టీ పదవులకూ దిక్కులేకపోవడంపై జంప్ జిలానీలు కుమిలిపోతున్నారు. ముందు నుంచీ పార్టీలో ఉన్న వారితో పోటీపడుతూ ఎలాంటి పదవుల్లేకుండా పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. మొత్తంగా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలు అటకెక్కాయి. ప్రస్తుతం అందరి దృష్టి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల భర్తీపైనే కేంద్రీకృతమై ఉంది.