Begin typing your search above and press return to search.

కోదండం మాష్టారు అంటే కేసీఆర్ కు భయమా?

By:  Tupaki Desk   |   22 Feb 2017 4:35 AM GMT
కోదండం మాష్టారు అంటే కేసీఆర్ కు భయమా?
X
జాగ్రత్త మంచిదే. కానీ.. అతి జాగ్రత్త అనర్థాలకు దారి తీస్తుంది. కంట్రోల్ తప్పకూడదని ప్రభుత్వ పెద్దలు ఫీల్ కావొచ్చు. కానీ.. పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మొదటికే మోసం రావొచ్చు. నిరుద్యోగ ర్యాలీ.. నిరసన విషయంలో అవసరానికి మించిన అతి జాగ్రత్తను.. అత్యుత్సాహాన్ని తెలంగాణ సర్కారు ప్రదర్శించినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ఒక నిరసన ర్యాలీ విషయంలో ప్రభుత్వం ఇంత అనూహ్య నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నట్లు? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

అద్భుతమైన పాలనను అందిస్తున్నట్లుగా చెప్పుకునే కేసీఆర్.. తాము చెప్పే మాటలన్ని నిజమైనప్పుడు.. కోదండరాం లాంటోళ్లు ర్యాలీలు నిర్వహిస్తే మాత్రం ఏం జరుగుతుంది? రాష్ట్రంలో అన్ని కులాల వారీగా.. వర్గాల వారీగా అభివృద్ధి పథంలో పయనించేందుకు వీలుగా పలు నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. వారి బతుకుల్ని మొత్తంగా మార్చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటం తెలిసిందే.

ఒక్క గొర్రెల పెంపకం దారుల ఇళ్లల్లోనే రానున్న కొద్ది సంవత్సరాల్లో రూ.40వేల కోట్ల సంపదను అదనంగా తీసుకొస్తానని నమ్మకంగా చెప్పే కేసీఆర్ మాటలు నిజమే అయినప్పడు.. గడిచిన మూడేళ్లలో (రెండు..మూడు నెలల తక్కువగా) భారీగా ఉద్యోగ కల్పన చేసినట్లుగా ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసినప్పుడు.. నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకోవటంలో అర్థం ఏమిటి? అన్నది ప్రశ్న.

అనుమతులు లేవన్న మాటే నిజమైతే..అందుకు కోదండం మాష్టారు లాంటి నేతను అరెస్ట్ చేయాలా? అన్నది మరో ప్రశ్న. ఇదే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకుంటే.. దుష్ట సీమాంధ్ర పాలకులు.. తెలంగాణ ద్రోహులు అంటూ ట్యాగ్ లైన్లు కట్టేసేవారు. మరి.. తాము కోరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. తమ వాళ్లే పాలకులైతే.. దుర్మార్గ సీమాంధ్రపాలకులకు బెటర్ గా వ్యవహరిస్తారని.. తమ పట్ల దయతో ఉంటారన్న వాదనలోనిజం ఎంతన్నది తాజా ఎపిసోడ్ తో అర్థమైంది.

తీవ్రఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నా.. హింసాత్మక సంఘటనలు జరిగినా.. టీజేఏసీని ఒక్కమాట అనటానికి..వారిపై ముద్రలు వేయటానికి ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు వణికిపోయేవారు. కోదండాన్ని.. టీజేఏసీని ఏమైనా అంటే.. తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బ తింటాయన్న ఆందోళన చెందేవారు. మరి.. సీమాంధ్ర పాలకులకున్న ఫీలింగ్స్ తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు లేవన్నది ఒక ప్రశ్న. కోదండం మాష్టారు చెబుతున్న మాటలు అబద్ధమనే అనుకుందాం. అదే నిజమైనప్పుడు.. నిజం ఏమిటో తెలంగాణ పాలకులు చెబితే సరిపోతుంది కదా.

అప్పటికి.. పాలకుల మాటలు నమ్మకుండా.. కోదండం మాష్టారి మాటల్ని నమ్మి వీధుల్లోకి వస్తే.. సర్కారు ఆత్మశోధన చేసుకోని.. తన తీరును మార్చుకుంటే సరిపోతుంది. అంతేకానీ.. తనకున్న అధికారంలో ఉద్యమాన్ని ఉక్కుపాదం పెట్టేయాలన్న ధోరణి ఎందుకన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఉద్యమం ఒక డ్రగ్ లాంటిదని.. అదొక్కసారి అలవాటైతే.. దాని నుంచి బయటకు తీసుకురావటం కష్టమన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు.. ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం చెబుతున్న మాటల్లోని అసలు నిజాన్ని కోదండం మాష్టారు లాంటి వారు గళం విప్పితే.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని.. అందుకే ఆదిలోనే దీనికి పుల్ స్టాప్ పెట్టటం ద్వారా.. నిరుద్యోగ నిరసన ర్యాలీని ఫ్లాప్ షో చేసేసి.. భవిష్యత్ ఉద్యమాలకు చెక్ పెట్టాలన్నది సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. తమ పాలన మీద నమ్మకం ఉన్నప్పటికీ.. కోదండం మాష్టారి ఉద్యమ నాయకత్వం మీదున్న నమ్మకమే.. కేసీఆర్ ను భయపెట్టేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/