Begin typing your search above and press return to search.

మంత్రుల తప్పుల్ని కేసీఆర్ ఎంతలా క్షమిస్తారంటే..

By:  Tupaki Desk   |   31 May 2016 7:28 AM GMT
మంత్రుల తప్పుల్ని కేసీఆర్ ఎంతలా క్షమిస్తారంటే..
X
తెలిసి తప్పు చేయకూడదు. అదే సమయంలో తెలీకుండా తప్పులు చేస్తే తాను ఎలాంటి చర్యా తీసుకోనన్న విషయాన్ని తనకు తానే చెప్పుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. నమ్మిన వారి విషయంలో తానెంత ఉదారంగా ఉంటానన్న విషయాన్ని ఆయన తన మాటలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. తన మంత్రి వర్గంలో పని చేస్తున్న మంత్రులంతా బాగా పని చేస్తున్నట్లుగా కితాబు ఇచ్చిన కేసీఆర్.. తన మంత్రివర్గ సభ్యుల్ని ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేయటం గమనార్హం.

ఈ మధ్య కాలంలో జిల్లాల్లో నేతల మధ్య అధిపత్య పోరు నడుస్తున్నా.. అలాంటివేమీ తన దృష్టికి రాలేదన్నట్లుగా.. జిల్లాల్లో నేతలు కూడా కలిసి పని చేస్తున్నారంటూ వ్యాఖ్యానించటం కేసీఆర్ కే చెల్లుతుందేమో. మంత్రుల పని తీరు గురించి చెబుతూ.. ‘‘వారి పనితీరుకు వందశాతం సంతృప్తిగా ఉన్నా’’ అని కితాబులివ్వటం విశేషం. అంతేకాదు.. తొలిసారి మంత్రులైన వారు పని నేర్చుకుంటున్నారని.. తెలీక తప్పులు చేసినా తాను వారికి ఆ విషయాల్ని అర్థమయ్యేటట్లు చెబుతున్నట్లు వెల్లడించారు.

ఇటీవల ఒక మంత్రి తాను చేయకూడని బదిలీ ఒకటి చేశారని.. సర్వీసు నిబంధనల ప్రకారం అలాంటి బదిలీ ముఖ్యమంత్రి మాత్రమే చేయాలని.. కానీ.. మంత్రి బదిలీ చేశారన్న ఉద్దేశంతో కార్యదర్శి కూడా సంతకం చేసి ఉత్తర్వులు ఇచ్చారని.. తనకు విషయం తెలిసి మంత్రిని పిలిపించి.. వివరంగా చెప్పి తాను సంతకం చేసినట్లుగా చెప్పారు. కేసీఆర్ మాటలన్నీ బాగానే ఉన్నా.. కొత్త మంత్రికి తెలీక తప్పు చేసి ఉండొచ్చు. కానీ.. సర్వీసులో తల పండిన కార్యదర్శలు మంత్రి మాటకు తలూపి సంతకం చేయటం ఏమిటి..? ఈ వ్యవహారం లాజిక్కు అందటం లేదే..? ఏమైనా మంత్రులు తెలీక చేసే తప్పుల్ని తాను కాస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పేశారని చెప్పాలి.